- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెప్టెంబర్‌లో మహిళల వన్డే వరల్డ్ కప్.. వైజాగ్‌లో ఓపెనింగ్ మ్యాచ్!

దిశ, స్పోర్ట్స్ : ఈ ఏడాది మహిళల వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో ఈ ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో వరల్డ్ కప్ ప్రారంభంకాబోతున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలో శనివారం బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో బోర్డు పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ విషయాలను బోర్డు వర్గాలు మీడియాకు తెలిపాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ ఓపెనింగ్ మ్యాచ్, ఓపెనింగ్ సెర్మనీ వైజాగ్‌లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నాయి. ఇతర వేదికలుగా ముల్లన్‌పూర్, ఇండోర్, త్రివేండం, గువహతిలను ఎంపిక చేసినట్టు తెలిపాయి. ఇంకా షెడ్యూల్ ఫైనల్ కావాల్సి ఉంది.
అలాగే, భారత పురుషుల జట్టు షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి. ‘అక్టోబర్‌లో టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్‌తో రెండు టెస్టుల ఆడనుంది. మొదటి వారంలో మొహాలి వేదికగా తొలి టెస్టు, అక్టోబర్ 10-14 మధ్య కోల్‌కతా వేదికగా రెండో టెస్టు జరగనుంది. అలాగే, నవంబర్‌లో సౌతాఫ్రికాతో మల్టీఫార్మాట్ సిరీస్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. రెండు టెస్టులకు ఢిల్లీ, గువహతి వేదికలు. టెస్టు సిరీస్ తర్వాత రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఆ తర్వాత ఐదు టీ20ల సిరీస్‌లో ఇరు జట్లు తలపడతాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో మ్యాచ్‌లు జరగనుండగా.. ఈ మ్యాచ్‌లకు కటక్, నాగ్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ ఆతిథ్యమివ్వనున్నాయి.’ అని బోర్డు వర్గాలు తెలిపాయి.
జోనల్ ఫార్మాట్‌లో దులీప్ ట్రోఫీ
వచ్చే దేశవాళీ సీజన్‌లో దులీప్ ట్రోఫీని తిరిగి జోనల్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. ఈ సీజన్‌లో దులీప్ ట్రోఫీని భారత్ ఏ, భారత్ బి, భారత్ సి, భారత్ డి జట్లతో నిర్వహించారు. ప్లేయర్లను జాతీయ సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, దీనిపై పలు రాష్ట్ర అసోసియేషన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో బీసీసీఐ దులీప్ ట్రోఫీని తిరిగి జోనల్ ఫార్మాట్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. ఆరు జోన్ల నుంచి జట్లు పాల్గొంటాయి. జోనల్ సెలెక్టర్లే ప్లేయర్లను ఎంపిక చేస్తారు.