ఐదోది పాయే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ క్లీన్‌స్వీప్

by Harish |
ఐదోది పాయే.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ క్లీన్‌స్వీప్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు ఘోరంగా విఫలమైంది. పర్యటనలో పేలవ ప్రదర్శన మూటగట్టుకున్న భారత్ సిరీస్‌ను గౌరవప్రదంగా ముగించలేకపోయింది. చివరి మ్యాచ్‌లోనూ ఓడి 5-0తో ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్ అయ్యింది. పెర్త్ వేదికగా శనివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 2-3 తేడాతో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 4వ నిమిషంలోనే భారత్ తరపున హర్మన్‌ప్రీత్ సింగ్ తొలి గోల్ చేశాడు. ఆ తర్వాత జట్టు శుభారంభాన్ని కొనసాగించలేకపోయింది. ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. హేవార్డ్ జెరెమీ, విల్లోట్ కై, బ్రాండ్ టిమ్ గోల్స్ చేయడంతో ఆ జట్టు 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివర్లో దామి బాబీ సింగ్ 53వ నిమిషంలో గోల్ చేసి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 3-2కు తగ్గించినా భారత్ ఓటమి నుంచి బయటపడలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు సన్నాహక పర్యటనగా భావించిన ఈ సిరీస్‌లో భారత్ ప్రదర్శన ఆందోళన కలిగించే అంశమే.

Advertisement

Next Story