IND VS BAN : మళ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా ఘనత

by Harish |
IND VS BAN : మళ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. ఫాస్టెస్ట్ క్రికెటర్‌గా ఘనత
X

దిశ, స్పోర్ట్స్ : పరుగుల రారాజు, టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అతను 47 పరుగులు చేయడంతో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ 27,012 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు అత్యంత వేగంగా 27 వేల పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉండేది. అతను 623 ఇన్నింగ్స్‌ల్లో ఆ ఘనత సాధించాడు. తాజాగా కోహ్లీ 594 ఇన్నింగ్స్‌ల్లోనే 27 వేల పరుగులు పూర్తి చేసిన సచిన్ రికార్డును తిరగరాశాడు. సచిన్ పేరిటే అత్యంత వేగంగా 25,000 రన్స్, 26,000 పరుగులు చేసిన రికార్డులు ఉండగా గతేడాది కోహ్లీనే అధిగమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్(34357) ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. కుమార్ సంగక్కర(28016), రికీ పాంటింగ్(27483) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

Advertisement

Next Story