సెమీస్‌లో భారత్ ఓటమి

by Javid Pasha |
సెమీస్‌లో భారత్ ఓటమి
X

దుబాయ్ : బ్యాడ్మింటన్ ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ కాంస్యంతోనే సరిపెట్టింది. టోర్నీలో సంచలన ప్రదర్శన చేసిన భారత్.. కీలకమైన సెమీస్‌లో పోరాడి ఓడింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత్ 3-2 తేడాతో చైనా చేతిలో ఓటమిపాలైంది. మొదట సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత స్టార్ ప్లేయర్స్ హెచ్‌ఎస్ ప్రణయ్, పీవీ సింధు అనామక ప్లేయర్స్ చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 13-21, 15-21 తేడాతో లె లాన్ క్సీ చేతిలో ఓడిపోగా.. ఉమెన్స్ సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు 9-21, 21-16, 18-21 తేడాతో గావో ఫాంగ్జీ చేతిలో పరాజయం పాలైంది.

రెండో గేమ్‌తో సింధు పోటీలోకి వచ్చిన ఆఖరి గేమ్‌లో పోరాడి ఓడింది. ఆ తర్వాత మెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో ధ్రువ్ కపిల్-చిరాగ్ శెట్టి భారత్‌‌కు తొలి విజయాన్ని అందించారు. హె జి టింగ్-జౌ హౌడాంగ్ జోడీపై 21-19, 21-19 తేడాతో భారత ద్వయం గెలుపొందింది. ఉమెన్స్ డబుల్స్ మ్యాచ్‌ను ట్రీసా జాలీ-గాయత్రి జంట 21-18, 13-21, 21-19 తేడాతో లియూ షెంగ్ షు-టాన్ నింగ్‌పై సొంతం చేసుకుని 2-2తో సమం చేసింది. డూ ఆర్ డై మ్యాచ్ అయిన మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇషాన్-తనీషా జోడీ 17-21, 13-21 తేడాతో జియాంగ్ జెన్ బాంగ్- వీ యాక్సిన్ చేతిలో ఓడిపోయింది. దాంతో సెమీస్‌ను 3-2తో కోల్పోయిన భారత్ బ్రాంజ్ ‌మెడల్‌తోనే ఇంటిదారి పట్టనుంది.

Advertisement

Next Story

Most Viewed