సాత్విక్ జోడీకి మళ్లీ నిరాశే

by Harish |
సాత్విక్ జోడీకి మళ్లీ నిరాశే
X

దిశ, స్పోర్ట్స్ : సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీకి మళ్లీ నిరాశే. సీజన్ తొలి టైటిల్ చిక్కినట్టే చిక్కి మళ్లీ చేజారింది. ఇదే నెలలో మలేషియా ఓపెన్‌ ఫైనల్‌లో ఓడిన ఈ జోడీ.. ఇండియా ఓపెన్‌లోనూ తుది పోరులో బోల్తా పడింది. ఢిల్లీలో జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 11-21, 18-21 తేడాతో కొరియా ద్వయం కాంగ్ మిన్ హ్యూక్-సియో సీయింగ్ జే చేతిలో పోరాడి ఓడింది. గంటా 5 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో శుభారంభం సాత్విక్ జోడీదే. ఆసక్తికరంగా మొదలైన తొలి గేమ్‌లో భారత జంట వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 13-9తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను నెగ్గింది. ఆ తర్వాత కొరియా జోడీ బలంగా పుంజుకుని రెండో గేమ్‌ను ఏకపక్షంగా గెలుచుకుంది. రెండో గేమ్ ఆరంభంలోనే 5-1తో వెనుకబడిన సాత్విక్, చిరాగ్ నెమ్మదిగా పుంజుకుని 7-5తో చేరువైనా.. ఆ తర్వాత వరుసగా 9 పాయింట్లు కోల్పోవడంతో రెండో గేమ్‌ను కోల్పోయింది. ఇక, నిర్ణయాత్మక మూడో గేమ్‌ను దక్కించుకునేందుకు సాత్విక్ జోడీ, కొరియా ద్వయం నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డాయి. అయితే, మొదటి నుంచి కొరియా షట్లర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. ఆఖర్లో 19-18తో సాత్విక్ జోడీ పోటీలోకి వచ్చినా కొరియా జోడీ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో సాత్విక్, చిరాగ్ జంట ఈ సీజన్‌లో వరుసగా రెండో టోర్నీలోనూ రన్నరప్‌గానే సరిపెట్టింది. మరోవైపు, మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను చైనా ప్లేయర్ షి యుకీ గెలుచుకున్నాడు. చైనీస్ తైపీ తై జు యింగ్ ఉమెన్స్ సింగిల్స్ విజేతగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed