Women's T20 World Cup : హర్మన్‌ప్రీత్ సేన పుంజుకుంటుందా?.. నేడు పాక్‌తో ఢీ

by Harish |
Womens T20 World Cup : హర్మన్‌ప్రీత్ సేన పుంజుకుంటుందా?.. నేడు పాక్‌తో ఢీ
X

దిశ, స్పోర్ట్స్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో భారీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. భారీగా నెట్‌రన్‌రేట్ కోల్పోయి ప్రస్తుతం గ్రూపు ఏలో చివరి స్థానంలో ఉన్నది. దీంతో సెమీస్‌ అవకాశాలు సన్నగిల్లగా.. మిగతా మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధిస్తేనే జట్టు ముందడుగు వేసే పరిస్థితి నెలకొంది. నేడు రెండో గ్రూపు మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హర్మన్‌ప్రీత్ సేనకు కీలకం కానుంది. ఓడితే సెమీస్ అవకాశాలు ప్రమాదంలో పడే చాన్స్ ఉంది. కాబట్టి, భారత జట్టు పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కివీస్‌తో మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో తేలిపోయింది. ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా జట్టు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ చేసిన 15 పరుగులే టాప్ స్కోరంటే బ్యాటింగ్‌లో ఏ విధంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ అంచనాలను అందుకోలేకపోయారు. 160 పరుగుల లక్ష్య ఛేదనలో 19 ఓవర్లలోనే 102 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లో రేణుక సింగ్ రెండు వికెట్లతో పర్వాలేదనిపించగా.. శ్రేయాంక, దీప్తి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తొలి మ్యాచ్‌లో లోపాలను భారత జట్టు అధిగమించడంతోపాటు గెలుపు బాట పట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే సెమీస్ దారులు మూసుకుపోయే ప్రమాదం ఉంది.

టీ20ల్లో పాక్‌పై ఆధిపత్యం భారత క్రికెటర్లలో ఆత్మవిశ్వాసం పెంచేదే. ఇప్పటి వరకు 15 సార్లు ఎదురుపడగా.. 12 సార్లు టీమిండియానే విజయం సాధించింది. మూడు సందర్భాల్లోనే పాక్ గెలిచింది. ఈ ఏడాది జూలైలో ఆసియా కప్‌లో కూడా పాక్‌ను ఓడించింది. అయితే, తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉన్నది. కెప్టెన్, ఆల్‌రౌండర్ ఫాతిమా సనా, మునీబా అలీ, సిద్రా అమీన్, నిదా దార్‌ బ్యాటర్లకుతోడు సాదియా ఇక్బాల్, నశ్రా సందు వంటి నాణ్యమైన బౌలర్లు జట్టులో ఉన్నారు. కాబట్టి, భారత మహిళలు ఆల్‌రౌండ్ ప్రదర్శననే నమ్ముకోవాలి.

Advertisement

Next Story

Most Viewed