IND VS SL : సిరీస్ సమం చేస్తారా?..నేడు శ్రీలంక, భారత్ జట్ల మధ్య మూడో వన్డే

by Harish |
IND VS SL : సిరీస్ సమం చేస్తారా?..నేడు శ్రీలంక, భారత్ జట్ల మధ్య మూడో వన్డే
X

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌లో టీమ్ ఇండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. తొలి వన్డే టై అవ్వగా.. రెండో మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. దీంతో వన్డే సిరీస్‌లో 1-0తో వెనుకబడిన టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. నేడు ఆఖరిదైన మూడో వన్డేలో శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోనుంది. ఆ మ్యాచ్‌లో ఓడితే సిరీస్ కోల్పోనున్న నేపథ్యంలో రోహిత్ సేనకు గెలవడం తప్పనిసరి. సిరీస్‌ను 1-1తో ముగించాలని భారత జట్టు భావిస్తున్నది. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్ల వైఫల్యం జట్టును నష్టపరిచింది. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. రోహిత్ వరుసగా రెండు హాఫ్ సెంచరీలతో రాణించగా.. అక్షర్ పటేల్ పర్వాలేదనిపించాడు.

అయితే, విరాట్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గిల్, దూబె తమ స్థాయి ప్రదర్శన చేయకపోవడం జట్టు ఓటమి కారణమైందని చెప్పడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలో మూడో వన్డే కోసం తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వికెట్ కీపర్‌గా రాహుల్‌ను పక్కనపెట్టి పంత్‌ను తీసుకునే చాన్స్ ఉంది. అలాగే, పెద్దగా ఆకట్టుకోని శివమ్ దూబె స్థానంలో రియాన్ పరాగ్‌కు చోటు కల్పించొచ్చు. ఆఖరి వన్డేలో భారత్ విజయం సాధించాలంటే రోహిత్‌తోపాటు మిగతా బ్యాటర్ల రాణించడం తప్పనిసరి.

మరోవైపు, శ్రీలంక సిరీస్‌పై కన్నేసింది. 27 ఏళ్లలో వన్డే సిరీస్‌లో భారత్‌ను ఓడించలేదు. ఇప్పుడు శ్రీలంకు ఆ అవకాశం వచ్చింది. ఆతిథ్య జట్టు స్పిన్నర్లు పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుంటున్నారు. రెండో వన్డేలో 6 వికెట్లు పడగొట్టిన జెఫ్రీ వాండర్సేతోపాటు అసలంక, దునిత్ వెల్లలాగే భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. బ్యాటర్లలో నిశాంక, కుసాల్ మెండిస్, కామిందు మెండిస్‌, దునిత్ వెల్లలాగే మంచి ఫామ్‌లో ఉన్నారు. మొత్తంగా టీమ్ ఇండియా విజయం కోసం అన్ని విభాగాల్లో రాణించాల్సిన అవసరం ఉన్నది.

Advertisement

Next Story