రేసులోకి ఇంగ్లాండ్ !.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్

by Swamyn |
రేసులోకి ఇంగ్లాండ్ !.. సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్
X

దిశ, స్పోర్ట్స్: భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం నుంచి మొదలైన మూడో టెస్టులో తొలి రోజు టీమ్ ఇండియానే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన విషయం తెలిసిందే. కెప్టెన్ రోహిత్, జడేజాల సూపర్ సెంచరీలతోపాటు సర్ఫరాజ్ ఖాన్(62) సైతం రాణించడంతో బ్యాటింగ్‌లో 326/5తో మంచి స్కోరు సాధించింది. రెండో రోజైన శుక్రవారం కూడా రెండో సెషన్ వరకు ఆడిన రోహిత్ సేన.. మొత్తం 445 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. మ్యాచ్‌పై మనదే ఆధిపత్యం. కానీ, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు.. గట్టి పునాదులు వేసుకుంది. ఓపెనర్ జాక్ క్రాలీ(15) స్వల్ప స్కోరుకే అవుటైనా మరో యువ ఓపెనర్ బెన్ డకెట్ మాత్రం తన అద్భుతమైన ఆట తీరుతో జట్టును దాదాపుగా రేసులోకి తీసుకొచ్చాడు. 88 బంతుల్లోనే సెంచరీతో చెలరేగి, శుభారంభాన్ని అందించాడు. మరో బ్యాటర్ ఓలీ పోప్(39) కూడా ఫరవాలేదనిపించాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్.. 207 పరుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్(133 బ్యాటింగ్), జో రూట్ (9బ్యాటింగ్) ఉన్నారు. భారత్‌ను అందుకునేందుకు ఇంగ్లాండ్ ఇంకా 238 పరుగుల దూరంలో ఉండగా, చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. మ్యాచ్‌పై ఇప్పటికీ టీమ్ ఇండియాదే ఆధిపత్యమైనప్పటికీ, ఇంగ్లాండ్ సైతం రేసులోకి వస్తోంది. రెండో రోజు రెండు వికెట్లు మాత్రమే తీసిన భారత బౌలర్లు.. అంతగా ప్రభావం చూపలేకపోయారు. సిరాజ్, అశ్విన్ మాత్రమే చెరో వికెట్ దక్కించుకున్నారు. మూడో రోజైనా ప్రత్యర్థిని అడ్డుకోకపోతే మ్యాచ్‌పై భారత జట్టు ఆధిపత్యాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాబట్టి, బౌలర్లు రాణించి ఇంగ్లాండ్‌కు అడ్డుకట్ట వేయాల్సిందే.

భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ

సెంచరీతో జట్టుకు శుభారంభాన్ని అందించిన బెన్ డకెట్.. ఈ శతకంతో భారత్‌పై ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 88 బంతుల్లోనే 19 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో టెస్టు కెరీర్‌లో మూడో శతకం సాధించి, టీమ్ ఇండియాపై వేగంగా సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో రాస్ టేలర్ (99 బంతుల్లో)ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. 2001లో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 84 బంతుల్లో సెంచరీ సాధించగా, 1974లో క్లైవ్ లాయిడ్ 85 బంతుల్లో సెంచరీ సాధించాడు.

అర్ధశతకాన్ని మిస్ చేసుకున్న ధ్రువ్

ఓవర్‌నైట్‌ 326/5 స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమ్‌ ఇండియా.. లంచ్ తర్వాత డ్రింక్స్ బ్రేక్ వరకు బ్యాటింగ్ చేసింది. ఆట మొదలైన కొద్దిసేపటికే.. రవీంద్ర జడేజా(112) మరో రెండు పరుగులు మాత్రమే జోడించి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అంతకన్నా ఒక ఓవర్ ముందే కుల్దీప్ యాదవ్ సైతం అండర్సన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆట మొదలైన కొద్దిసేపటికే వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో తొలి సెషన్‌లోనే భారత్‌ ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, ఆ తర్వాత వచ్చిన అరంగేట్ర ఆటగాడు ధ్రువ్ జురెల్(46), అశ్విన్(37)తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఎనిమిదో వికెట్‌కు వీరు 77 పరుగులు జోడించారు. ధ్రువ్ సైతం సర్ఫరాజ్ మాదిరిగానే అరంగేట్ర టెస్టులోనే అర్ధసెంచరీ సాధిస్తాడని అనుకున్నప్పటికీ, మరో నాలుగు పరుగుల దూరంలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రెహాన్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. అంతకన్నా ముందే అశ్విన్ సైతం రెహాన్ బౌలింగ్‌లోనే క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక, చివర్లో వచ్చిన బుమ్రా దూకుడుగా ఆడాడు. 28 బంతుల్లోనే మూడు ఫోర్లు, సిక్సర్‌తో 26 పరుగులు చేశాడు. దూకుడుగా ఆడే క్రమంలోనే మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటవ్వడంతో 445 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 445/10 (130.5 ఓవర్లు)

యశస్వి జైశ్వాల్(సి)రూట్(బి)మార్క్‌వుడ్ 10, రోహిత్(సి)స్టోక్స్(బి)మార్క్‌వుడ్ 131, శుభ్‌మన్ గిల్(సి)ఫోక్స్(బి)మార్క్‌‌వుడ్ 0, రజత్ పాటిదార్(సి)డక్కెట్(బి)టామ్ హార్ట్లీ 5, జడేజా(సి అండ్ బి) రూట్ 112, సర్ఫరాజ్ ఖాన్ రనౌట్(మార్క్‌వుడ్) 62, కుల్దీప్ యాదవ్ (సి) జేమ్స్ అండర్సన్ (బి) రెహాన్ 4, ధ్రువ్ (సి) ఫోక్స్ (బి) రెహాన్ 46, అశ్విన్ (సి) జేమ్స్ అండర్సన్ (బి) రెహాన్ 37, బుమ్రా (ఎల్బీడబ్ల్యూ) మార్క్ వుడ్ 26, సిరాజ్ 3 నాటౌట్ ; ఎక్స్‌ట్రాలు-9

వికెట్ల పతనం : 22-1, 24-2, 33-3, 237-4, 314-5, 331-6, 331-7, 408-8, 415-9, 445-10

బౌలింగ్: అండర్సన్ (25-7-61-1), మార్క్‌వుడ్(27.5-2-114-4), టామ్ హార్ట్‌లీ (40-7-109-1), జో రూట్ (16-3-70-1), రెహాన్ అహ్మద్(22-2-85-2)

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 207/2 (35ఓవర్లు)

జాక్ క్రాలీ (సి) రాజత్ పాటిదర్ (బి) అశ్విన్ 15, బెన్ డకెట్ 133 బ్యాటింగ్, ఓలీ పాప్(ఎల్బీడబ్ల్యూ) సిరాజ్ 39, జో రూట్ 9 బ్యాటింగ్ ; ఎక్స్‌ట్రాలు-11

వికెట్ల పతనం: 89-1, 182-2

బౌలింగ్: బుమ్రా (8-0-34-0), సిరాజ్ (10-1-54-1), కుల్దీప్ యాదవ్ (6-1-42-0), అశ్విన్ (7-0-37-1), జడేజా (4-0-33-0)

Advertisement

Next Story