ఇక, బౌలర్ల చేతుల్లోనే.. ఛేదనలో 332 పరుగుల దూరంలో ఇంగ్లాండ్

by Harish |
ఇక, బౌలర్ల చేతుల్లోనే.. ఛేదనలో 332 పరుగుల దూరంలో ఇంగ్లాండ్
X

దిశ, స్పోర్ట్స్ : రెండు టెస్టు‌లో భారత్ విజయం ఇక బౌలర్ల చేతుల్లోనే ఉంది. గిల్ సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ ముందు టీమ్ ఇండియా 399 పరుగుల టార్గెట్ పెట్టింది. ఆదివారం చివరి సెషన్‌లో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా టీమ్ ఇండియా విజయానికి 9 వికెట్లు కావాలి. మరోవైపు, ఆటలో రెండు రోజులు మిగిలి ఉండగా ఇంగ్లాండ్ నెగ్గాలంటే ఇంకా 332 పరుగులు చేయాలి. పిచ్‌ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో భారత్‌కే విజయావకాశాలు ఎక్కువ. సోమవారమే మ్యాచ్ ముగియచ్చు కూడా. కానీ, ప్రత్యర్థిని నమ్మడానికి లేదు. మరి, భారత బౌలర్లు ఏం చేస్తారో..

తొలి టెస్టులో అనూహ్యంగా ఓడిన టీమ్ ఇండియా రెండో టెస్టులో విజయం దిశగా వెళ్తున్నది. ప్రస్తుతం మ్యాచ్‌పై ఆధిపత్యం భారత్‌దే. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆదివారం మ్యాచ్ ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 67/1 స్కోరుతో నిలిచింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 28/0తో ఆట కొనసాగించిన భారత్ మూడో రోజు రెండు ఇన్నింగ్స్‌లపాటే నిలిచింది. శుభ్‌మన్ గిల్(104, 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్(45) విలువైన పరుగులు జోడించాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ(4/77) సత్తాచాటగా.. రెహాన్ అహ్మద్ 3 వికెట్లు, అండర్సన్ 2 రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం కలుపుకుని టీమ్ ఇండియా.. ఇంగ్లాండ్ 399 పరుగుల భారీ టార్గె్ పెట్టింది. చివరి సెషన్‌లో ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్ డక్కెట్(28)ను అశ్విన్ అవుట్ చేసి ఓపెనింగ్‌ జోడీని విడదీశాడు. మరో ఓపెనర్ జాక్ క్రాలీ(29 బ్యాటింగ్), రెహాన్ అహ్మద్(9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.

రోహిత్ మళ్లీ..

కెప్టెన్ రోహిత్ శర్మ(13) మరోసారి నిరాశపరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ స్వల్ప స్కోరుకే పరిమితమయ్యాడు. ఓవర్‌నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే అవుటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి మైదానం వీడాడు. మరోవైపు, తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీతో కదం తొక్కిన యశస్వి జైశ్వాల్(17) రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అండర్సన్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో టీమ్ ఇండియా మూడో రోజు ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయి 30/2 స్కోరుతో నిలిచింది.

ఆదుకున్న గిల్.. పోరాడిన అక్షర్

ఫామ్ లేమితో ఇబ్బంది పడిన శుభ్‌మన్ గిల్ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. సెంచరీతో కదం తొక్కి జట్టుకు అండగా నిలిచాడు. రోహిత్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు. అయ్యర్ డిఫెన్స్‌కే పరిమితమవ్వగా.. స్ట్రైక్ రొటేట్ చేస్తూ గిల్‌కు సహకరించాడు. దీంతో ఇంగ్లాండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మద్‌లపై గిల్ ఎదురుదాడికి దిగాడు. మొదట నిదానంగా ఆడిన అతను.. ఆ తర్వాత బౌండరీలతో దూకుడు పెంచాడు. ఈ క్రమంలో 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. రెహాన్ అహ్మద్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి 50 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే శ్రేయస్ అయ్యర్(29) అవుటవడంతో 81 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులో పాతుకపోయినట్టే కనిపించిన అయ్యర్.. టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్(9) త్వరగానే మైదానం వీడాడు. ఈ క్రమంలోనే 130/4 స్కోరుతో తొలి సెషన్‌ను ముగించిన భారత్.. గిల్‌కు అక్షర్ పటేల్ కూడా తోడవడంతో రెండో సెషన్‌లో ఎక్కువ భాగం ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ జోడీ 89 పరుగుల విలువైన భాగస్వామ్యం జోడించింది. ఈ క్రమంలోనే రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన గిల్ కాసేపటికే సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. టెస్టుల్లో రెండో శతకం బాదాడు. గతేడాది మార్చిలో ఆసిస్‌పై తొలి సెంచరీ చేశాడు. అయితే, కాసేపటికే అతని పోరాటం ముగిసింది. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత భారత్ పతనం వేగవంతమైంది. టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ వరుసగా వికెట్లు సాధించారు. అక్షర్(45) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకోగా.. శ్రీకర్ భరత్(6) మరోసారి విఫలమయ్యాడు. కుల్దీప్ యాదవ్(0) అవుటైన తర్వాత అశ్విన్(29), బుమ్రా(0) కాసేపు పోరాటం చేశారు. రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అశ్విన్ అవుటవడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్ : 396 ఆలౌట్

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 253 ఆలౌట్

భారత్ రెండో ఇన్నింగ్స్ : 255 ఆలౌట్(78.3 ఓవర్లు)

జైశ్వాల్(సి)రూట్(బి)అండర్సన్ 17, రోహిత్(బి)అండర్సన్ 13, గిల్(సి)ఫోక్స్(బి)షోయబ్ బషీర్ 104, శ్రేయస్ అయ్యర్(సి)స్టోక్స్(బి)టామ్ హార్ట్లీ 29, రజత్ పాటిదార్(సి)ఫోక్స్(బి)రెహాన్ అహ్మద్ 9, అక్షర్ ఎల్బీడబ్ల్యూ(బి)టామ్ హార్ట్లీ 45, భరత్(సి)స్టోక్స్(బి)రెహాన్ అహ్మద్ 6, అశ్విన్(సి)ఫోక్స్(బి)రెహాన్ అహ్మద్ 29, కుల్దీప్(సి)డక్కెట్(బి)టామ్ హార్ట్లీ 0, బుమ్రా(సి)బెయిర్‌స్టో(బి)టామ్ హార్ట్లీ 0, ముకేశ్ 0 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 29-1, 30-2, 111-3, 122-4, 211-5, 220-6, 228-7, 229-8, 255-9, 255-10

బౌలింగ్ : అండర్సన్(10-1-29-2), షోయబ్ బషీర్(15-0-58-1), రెహాన్ అహ్మద్(24.3-5-88-3), రూట్(2-1-1-0), టామ్ హార్ట్లీ(27-3-77-4)

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : 67/1(14 ఓవర్లు)

జాక్ క్రాలీ 29 బ్యాటింగ్, డక్కెట్(సి)భరత్(బి)అశ్విన్ 28, రెహాన్ అహ్మద్ 9 బ్యాటింగ్; ఎక్స్‌ట్రాలు 1.

వికెట్ల పతనం : 50-1

బౌలింగ్ : బుమ్రా(5-1-9-0), ముకేశ్(2-0-19-0), కుల్దీప్(4-0-21-0), అశ్విన్(2-0-8-1), అక్షర్(1-0-10-0)

Advertisement

Next Story