Suryakumar Yadav: అదరగొట్టిన సూర్య కుమార్‌.. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు (వీడియో)

by Vinod kumar |   ( Updated:2023-09-26 04:42:11.0  )
Suryakumar Yadav: అదరగొట్టిన సూర్య కుమార్‌.. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ అదరగొట్టాడు. సూర్యకుమార్‌ 37 బంతుల్లో 72 (6 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగులతో చెలరేగాడు. కామెరూన్ గ్రీన్ వేసిన 44 ఓవర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ వరుసగా నాలుగు సిక్సర్లు బాదడం విశేషం. 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాదుతాడా? అనే సందేహాన్ని కలిగించాడు. చివరకు గ్రీన్ చాకచక్యంగా బౌలింగ్ చేసిన పరువు కాపాడుకున్నాడు. సూరీడు విధ్వంసానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత ఇన్నింగ్స్ 44వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని గ్రీన్ లెగ్ సైడ్ వేయగా.. సూర్య పికప్ షాట్‌తో బ్యాక్‌వార్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్ కొట్టాడు. రెండో బంతిని కూడా లెగ్ సైడ్ వేయగా ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ తరలించాడు. మూడో బంతిని ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా తరలించి హ్యాట్రిక్ సిక్సర్ బాదాడు. నాలుగో బంతిని ఫుల్ లెంగ్త్‌లో వేయగా సూర్య.. డీప్ మిడ్ వికెట్ దిశగా సిక్సర్ రాబట్టి.. బౌలర్ వెన్నులో వణుకు పుట్టించాడు.

ఎలా వేస్తున్నా సిక్స్‌లు బాదుతుండటంతో గ్రీన్.. ఐదో బంతిని వైడ్ ఔట్ సైడ్ ఆఫ్‌స్టంప్ దిశగా వేసి సూర్య సిక్సర్‌ను అడ్డుకున్నాడు. అప్పటికీ సిక్స్ కొట్టే ప్రయత్నంలో ఉన్నా సూర్య.. సాధ్యం కాదని గ్రహించి సింగిల్ తీశాడు. దాంతో ఆసీస్ ఆటగాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఇన్నింగ్స్ ద్వారా తనదైన రోజున ఎంతటి ప్రమాదకర ఆటగాడినో సూర్య మరోసారి తెలియజేశాడు. 4 బంతుల్లో నాలుగు సిక్స్‌లు బాదిన మూడో భారత ఆటగాడిగా సూర్య చరిత్రకెక్కాడు. అతని కన్నా ముందు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ ఈ ఫీట్ సాధించారు.

Advertisement

Next Story