IND vs AUS 2nd ODI: వాళ్లిద్దరికీ లాస్ట్ ఛాన్స్.. రెండో వన్డే ఆడే టీమిండియా జట్టు ఇదే!

by Vinod kumar |
IND vs AUS 2nd ODI: వాళ్లిద్దరికీ లాస్ట్ ఛాన్స్.. రెండో వన్డే ఆడే టీమిండియా జట్టు ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ ఇద్దరూ జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కొంత తడబడ్డారు. అయితే కెప్టెన్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో రెండో వన్డేలో భారత జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారనే చర్చ జరుగుతోంది. మూడో వన్డే సమయానికి రోహిత్, విరాట్, కుల్దీప్, హార్దిక్ తిరిగి జట్టులో చేరనున్నారు. దీంతో ఏమైనా ప్రయోగాలు చేయాలన్నా, కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నా రెండో వన్డేలోనే ఛాన్స్ ఉంది.

ఈ నేపథ్యంలో రెండో వన్డేలో జట్టులో కొన్ని మార్పులు చేయాలని రాహుల్ ద్రావిడ్ అనుకుంటున్నారని సమాచారం. దీనికోసం ఇషాన్ కిషన్‌ను పక్కన పెట్టాలని అనుకుంటున్నారట. వికెట్ కీపర్‌గా రాహుల్ ఉండగా.. కిషన్ కేవలం మిడిలార్డర్ బ్యాటర్‌గా ఆడుతున్నాడు. కాబట్టి ఈ స్థానంలో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్‌కు రెండో వన్డేలో కూడా విశ్రాంతి ఇస్తారని తెలుస్తోంది. ఇక తొలి వన్డేలో బ్యాటుతో విఫలమై, ఫీల్డింగ్‌లోనూ తేలిపోయిన శ్రేయాస్ అయ్యర్‌కు ఇదే చివరి అవకాశం అని చెప్పొచ్చు. చాలా కాలం తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కూడా మొదటి వన్డేలో ఫర్వాలేదనిపించాడు. బంతిని అద్భుతంగా స్పిన్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. మొదటి వన్డేలో బంతితో ఫెయిలైన శార్దూల్ ఠాకూర్‌కు కూడా రెండో వన్డే లాస్ట్ ఛాన్స్ అనే చెప్పాలి. అతను ఫెయిలైతే వరల్డ్ కప్‌లో అతని స్థానాన్ని అశ్విన్ ఆక్రమించేస్తాడు.

Advertisement

Next Story