కొత్త రూల్ ప్రవేశపెట్టిన ఐసీసీ.. టీ20 వరల్డ్ కప్ నుంచి అమలు

by Harish |
కొత్త రూల్ ప్రవేశపెట్టిన ఐసీసీ.. టీ20 వరల్డ్ కప్ నుంచి అమలు
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ‘స్టాప్ క్లాక్’ రూల్‌ను తప్పనిసరి చేసింది. శుక్రవారం జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక మీటింగ్‌లో ఈ రూల్‌ ఆమోదం పొందింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో ‘స్టాప్ క్లాక్’ రూల్‌ను అమలు చేయనున్నట్టు ఐసీసీ తెలిపింది. జూన్‌లో ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుందని చెప్పింది. మ్యాచ్‌లను సకాలంలో ముగించాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు తెలిపింది. వన్డేల్లో ఈ రూల్‌తో 20 నిమిషాలు ఆదా అవుతుందని చెప్పింది. అలాగే, టీ20 వరల్డ్ కప్-202‌4లో సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు రిజర్వ్ డే‌లను ప్రకటించింది. ఫలితాన్ని నిర్ణయించడానికి గ్రూపు దశ మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో ఐదు ఓవర్లు, సూపర్-8 మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మీటింగ్‌లో టీ20 వరల్డ్ కప్-2026 క్వాలిఫికేషన్ ప్రాసెస్‌లను బోర్డు ఆమోదించింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో పాల్గొనే 20 జట్లలో 2024 టీ20 వరల్డ్ కప్‌లోని టాప్-8 జట్లు, ఐసీసీ ర్యాంక్‌ల ఆధారంగా నాలుగు జట్లు ఆటోమేటిక్‌గా అర్హత సాధిస్తాయి. మిగతా జట్లను రీజినల్‌ క్వాలిఫైయర్‌ మ్యాచ్‌ల ద్వారా ఎంపిక చేస్తారు.

స్టాప్ క్లాక్ రూల్ అంటే?

పరిమిత ఓవర్లలో మ్యాచ్ సమయాన్ని ఆదా చేయడానికి ఐసీసీ స్టాప్ క్లాక్ రూల్‌ను తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం..బౌలింగ్ జట్టు ఓవర్ పూర్తయిన తర్వాత 60 సెకన్ల లోపు తర్వాతి ఓవర్ వేయడం ప్రారంభించాలి. ఓవర్ పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ క్లాక్‌లో 60 నుంచి సున్నా వరకు కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఆ లోపు బౌలింగ్ జట్టు ఓవర్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఒక వేళ బంతి వేయలేకపోతే రెండు సార్లు అంపైర్ వార్నింగ్ ఇస్తాడు. మూడోసారి కూడా బౌలింగ్ జట్టు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తారు.

Advertisement

Next Story

Most Viewed