'అతను నా ఆస్తులేం తీసుకోలేదు'.. ధోనీతో విభేదాలపై హర్భజన్ సింగ్ క్లారిటీ

by Vinod kumar |   ( Updated:2023-03-20 13:17:46.0  )
అతను నా ఆస్తులేం తీసుకోలేదు.. ధోనీతో విభేదాలపై హర్భజన్ సింగ్ క్లారిటీ
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీతో తనకు విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలకు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెక్ పెట్టాడు. 2021 డిసెంబర్‌లో హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి ధోనీ వంటి ఆటగాళ్లకు లభించిన మద్దతు ఇతర క్రికెటర్లకు కూడా ఉంటే మాజీ క్రికెటర్లలో చాలా మంది మరికొంతకాలం క్రికెట్ ఆడేవారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వైరలయ్యాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన హర్భజన్ సింగ్ అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు.

‘నాకు తెలిసినంత వరకు ధోనీ నా ఆస్తులేం తీసుకోలేదు. కానీ, అతని ఆస్తులపై నాకు ఇంట్రెస్ట్ ఉంది. ముఖ్యంగా అతని ఫామ్‌హౌస్‌ అంటే నాకు చాలా ఇష్టం’ అని భజ్జీ తెలిపాడు. ‘ధోనీతో నాకెందుకు సమస్య ఉంటుంది. మేమిద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాం. ఇప్పటికీ మేము మంచి స్నేహితులం కూడా. వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉండటంతో కలుసుకోలేకపోతున్నాం. అంతేగానీ, మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’ అని వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. కాగా, ధోనీ నాయకత్వంలో 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గి భారత జట్టులో హర్భజన్ సింగ్ సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే, ఐపీఎల్‌లో ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నయ్ సూపర్ కింగ్స్‌ జట్టు తరఫున కూడా 2018, 2019, 2020 ఎడిషన్లలో హర్భజన్ సింగ్ ఆడాడు.

Advertisement

Next Story