ఓపెనర్ల వీరవిహారం.. ఆర్సీబీపై గుజరాత్ విజయం

by Swamyn |
ఓపెనర్ల వీరవిహారం.. ఆర్సీబీపై గుజరాత్ విజయం
X

దిశ, స్పోర్ట్స్: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుపై 19పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు వాల్వర్ట్(76; 45 బంతుల్లో 13 ఫోర్లు), బెత్ మూనీ(85 నాటౌట్; 51బంతుల్లో 12ఫోర్లు, ఒక సిక్సు) అర్ధశతకాలతో వీరవిహారం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 140 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఆ తర్వాత వాల్వర్ట్ రనౌట్ అవ్వడంతో.. స్కోరు నెమ్మదించింది. మూనీ ఒక్కరే చివరివరకు నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించలేదు. 200 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేయగలిగింది. బౌలింగ్‌లో అష్లే గార్డెనర్ రెండు వికెట్లు, కార్తిన్ బ్రైస్, తనుజా ఒక్కో వికెట్ పడగొట్టడంతో ఆర్సీబీ టాపార్డర్ విఫలమైంది. స్మృతి మంధానా(24), మేఘన(4), ఎలీస్ పెర్రీ(24), సోఫీ డివైన్(23) చేతులెత్తేశారు. అయితే, ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జార్జియా(48; 22బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సులు) ధాటిగా ఆడి, ఆర్సీబీలో ఆశలు పెంచింది. కానీ, చివర్లో రనౌట్ అయి నిరాశపర్చింది. ఫలితంగా ఆర్సీబీపై గుజరాత్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోతూ వచ్చిన గుజరాత్ జెయింట్స్.. మొత్తానికి ఐదో మ్యాచ్‌లో గెలుపొందింది.


Advertisement

Next Story