కోహ్లీపై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

by Harish |
కోహ్లీపై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-2024 ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నది. ఈ నెల 22న చెన్నయ్‌లోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో చెన్నయ్ సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియంలో ప్రదర్శన పరంగా కోహ్లీ గొప్పతనం తగ్గిందని వ్యాఖ్యానించాడు. ‘20 ఓవర్లపాటు బ్యాటింగ్ చేయాలనే ఆలోచనతో కోహ్లీ వస్తేనే మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయగలడు. ఎందుకంటే చెపాక్‌లో 200 స్కోరు చేయడం అంత సులభం కాదు. చెపాక్ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. టెన్నిస్ బాల్‌లా బంతి బౌన్స్ అవుతుంది. అంతేకాకుండా, వాళ్లకు జడేజా ఉన్నాడు. అతను స్టంప్ టు స్టంప్ బౌలింగ్ చేస్తాడు. బంతిని టర్న్ చేయగలడు. స్లో చేయగలడు. అతని బౌలింగ్‌లో బ్యాటర్లకు సవాల్ తప్పదు.’ అని తెలిపాడు.

కోహ్లీ 2016 నాటి ప్రదర్శనను పునరావృతం చేయాల్సిన అవసరాన్ని హర్భజన్ సింగ్ నొక్కి చెప్పాడు. ‘2016 సీజన్ తరహాలో కోహ్లి రాణించడం చాలా ముఖ్యం. కోహ్లీ పరుగుల చేస్తేనే జట్టు ముందుకు వెళ్తుంది. ఆర్సీబీ కప్ గెలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ, ఆ జట్టులో విరాట్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, రజత్ పాటిదార్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వారికి మంచి బ్యాటింగ్ సామర్థ్యం ఉంది. ప్రతి ఒక్కరూ కోహ్లీ 2016లో ఆడినట్టు ఆడాలని కోరుకుంటున్నారు.’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

2016 సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 973 పరుగులు చేశాడు. అందులో నాలుగు శతకాలు, ఏడు హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు స‌ృష్టించాడు. మరోవైపు, ఐపీఎల్‌లో 237 మ్యాచ్‌ల్లో 130 స్ట్రైక్ రేటుతో 7,263 పరుగులు చేశాడు. అయితే, చెపాక్ స్టేడియంలో మాత్రం అతను 30 సగటు, 111 స్ట్రైక్ రేటుతో 985 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్కేపై అతను ఒక్క సెంచరీ కూడా బాదలేదు.

Advertisement

Next Story