ఫ్రెంచ్ ఓపెన్‌లో లక్ష్యసేన్, సాత్విక్ జోడీ శుభారంభం

by Harish |
ఫ్రెంచ్ ఓపెన్‌లో లక్ష్యసేన్, సాత్విక్ జోడీ శుభారంభం
X

దిశ, స్పోర్ట్స్ : ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో లక్ష్యసేన్ 15-21, 21-15. 21-3 తేడాతో జపాన్‌ ఆటగాడు కాంత సునేయమ‌ను చిత్తు చేశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌కు తొలి గేమ్‌లో ప్రత్యర్థి షాకిచ్చాడు. 8-5తో ఆధిక్యంలోకి కొనసాగిన లక్ష్యసేన్ ఆ తర్వాత పట్టు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకున్నాడు. తొలి గేమ్ తర్వాత లక్ష్యసేన్ అద్భుతంగా పుంజుకున్నాడు. వరుసగా రెండు గేమ్‌లను ఏకపక్షంగా గెలుచుకున్నాడు. లక్ష్యసేన్ జోరు ముందు ప్రత్యర్థి నిలువలేకపోయాడు. మరోవైపు, యువ ఆటగాడు ప్రియాన్ష్ రజావత్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించాడు. టాప్ సీడ్, డెన్మార్క్ స్టార్ విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 21-8, 21-15 తేడాతో పరాజయం పాలయ్యాడు. తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ నేడు తొలి రౌండ్‌ ఆడనున్నారు.

రెండో రౌండ్‌కు సాత్విక్ జోడీ

ఈ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో సాత్విక్ జోడీ 21-13, 24-22 తేడాతో మలేషియాకు చెందిన ఓంగ్ యూ సిన్-టియో ఈ యి జోడీపై విజయం సాధించింది. ఉమెన్స్ డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ 16-21, 21-19, 21-17 తేడాతో భారత్‌కే చెందిన తనీషా క్రాస్టో- అశ్విని పొనప్ప జంటపై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది.

Advertisement

Next Story