కెన్యా జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్

by Harish |
కెన్యా జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆల్‌రౌండర్
X

దిశ, స్పోర్ట్స్ : భారత మాజీ ఆల్‌రౌండర్ దొడ్డ గణేశ్ కెన్యా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని కెన్యా క్రికెట్ బోర్డు బుధవారం వెల్లడించింది. సంవత్సరం పాటు గణేశ్ కెన్యాకు ప్రధాన కోచ్‌గా సేవలందించనున్నాడు. ‘కెన్యాను వన్డే, టీ20 ప్రపంచకప్‌లకు అర్హత సాధించేలా చేయడం నా మొదటి లక్ష్యం. కెన్యా ఆటగాళ్ల అంకితభావం, కష్టం చూశాను. వాళ్లలో చాంపియన్ల స్ఫూర్తిపై నమ్మకం ఉంది.’అని గణేశ్ తెలిపారు. సెప్టెంబర్‌లో ఐసీసీ డివిజన్ 2 చాలెంజ్ లీగ్‌, అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ ఆఫ్రికా క్వాలిఫయర్స్ కెన్యా ప్రధాన కోచ్‌గా గణేశ్‌కు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి.

కాగా, 51 ఏళ్ల గణేశ్ 1997లో 4 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్‌లో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు. దేశవాళీలో కర్ణాటకకు ఆడిన అతను 193 ఫస్ట్ క్లాస్, లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 493 వికెట్లు తీయడంతోపాటు 2,548 పరుగులు చేశాడు. మరోవైపు, 1996-2011 వరకు వరుసగా ఐదుసార్లు వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన కెన్యా.. 2003లో సెమీస్‌కు కూడా చేరుకుంది. అక్కడ టీమిండియా చేతిలో ఓడింది. 2014 వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో అర్హత సాధించడంలో విఫలమై కెన్యా వన్డే హోదా కోల్పోయింది.

Advertisement

Next Story