ఆసిస్‌పై 28ఏళ్ల తర్వాత విజయం

by Swamyn |
ఆసిస్‌పై 28ఏళ్ల తర్వాత విజయం
X

దిశ, స్పోర్ట్స్: భారత మహిళల హాకీ జట్టు సొంతగడ్డపై 28ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భాగంగా ఒడిశా వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల హాకీ జట్టు 1-0తో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 34వ నిమిషంలో వందన కటారియా అద్భుత గోల్ చేసి భారత్‌ను 1-0తో ఆధిక్యంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా మరో గోల్ కోసం ఇరు జట్లూ తీవ్రంగా శ్రమించినప్పటికీ డిఫెండర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. నిర్ణీత సమయంలో ముగిసేసరికి ఒక గోల్‌తో లీడ్‌లో ఉన్న భారత్.. విజయం సాధించింది. చివరిసారిగా 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో ఆసిస్‌పై 1-0తో గెలిచిన భారత మహిళలు.. ఆ తర్వాత జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడిపోతూ వచ్చారు. ఈ క్రమంలోనే నాలుగేళ్ల తర్వాత మళ్లీ విజయం సాధించారు. అంతేకాకుండా, 28ఏళ్ల తర్వాత సొంతగడ్డపై భారత మహిళలు.. ఆస్ట్రేలియాను ఓడించడం విశేషం. చివరిసారిగా 1996లో భారత్‌లో జరిగిన ఇందిరా గాంధీ గోల్డ్‌ కప్‌లో ఆసిస్‌పై భారత మహిళల జట్టు గెలుపొందింది. అప్పటి జట్టులో సభ్యురాలిగా ఉన్న కత్రినా పావెల్.. ఇప్పుడు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, ‘ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్’లో భారత జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా, రెండింట్లో గెలిచి, మిగతా రెండింట్లో ఓడిపోయింది. 9 జట్లు ఉన్న ఈ టోర్నీలో భారత్ నాలుగో స్థానంలో ఉంది.


Advertisement

Next Story