హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ?.. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు?

by Harish |
హైబ్రిడ్ మోడల్‌లో చాంపియన్స్ ట్రోఫీ?.. దుబాయ్ వేదికగా భారత్ మ్యాచ్‌లు?
X

దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది పాకిస్తాన్‌లో జరగబోయే చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో టీమ్ ఇండియా పాల్గొంటుందా?లేదా అన్న దానిపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పలు వార్తలు వస్తున్నాయి. పాక్‌కు భారత్ వెళ్లబోదని ఐసీసీకి బీసీసీఐ తెలియజేసినట్టు ఇటీవల ప్రచారం జరగగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఖండించారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. చాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని ఐసీసీ ఆలోచనలో ఉన్నదని ఆ వార్త సారాంశం.

టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే భారత్ మ్యాచ్‌లకు దుబాయ్ ఆతిథ్యమివ్వనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల 19 నుంచి 22 వరకు కొలంబోలో ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్ జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాతే టోర్నీలో భారత్ పాల్గొనడంపై, హైబ్రిడ్ మోడల్‌‌పై స్పష్టత రానుంది. కాగా, గతేడాది పాక్‌లో జరగాల్సిన ఆసియా కప్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరగగా.. మిగతా మ్యాచ్‌లో పాక్‌లో జరిగాయి. ఆసియా కప్ తరహాలోనే చాంపియన్స్ ట్రోఫీని కూడా నిర్వహించాలని ఐసీసీ సమావేశంలో బీసీసీఐ తన నిర్ణయాన్ని తెలియజేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2008లో చివరిసారిగా భారత జట్టు పాక్‌లో పర్యటించింది.

Advertisement

Next Story

Most Viewed