గుర్తుంచుకో.. పుజారా ఎదురుచూస్తున్నాడు.. గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి

by Harish |
గుర్తుంచుకో.. పుజారా ఎదురుచూస్తున్నాడు.. గిల్‌కు వార్నింగ్ ఇచ్చిన రవిశాస్త్రి
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో అతను స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. దీంతో అదే మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమ్ ఇండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి వరుసగా గిల్ నిరాశపర్చడం పట్ల స్పందించాడు. ఆటను మెరుగుపర్చుకోవాలని హెచ్చరించాడు. ‘టీమ్ ఇండియా యువకులతో నిండి ఉన్నది. యువ క్రికెటర్లు తమను తాము నిరూపించుకోవాల. జట్టులోకి తిరిగి రావడానికి పుజారా ఎదురుచూస్తున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రంజీ ట్రోఫీలో అతను సత్తాచాటుతున్నాడు.’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

కాగా, రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గిల్ 46 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. మొదట్లో నిదానంగా ఆడిన గిల్ ఆ తర్వాత గేర్ మార్చాడు. అండర్సన్ బౌలింగ్‌లో ఓ ఫోర్, షోయబ్ బషీర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి దూకుడు పెంచాడు. అయితే, ఆ దూకుడును ఎంతో సేపు లేదు. కాసేపటికే అండర్సన్‌ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌటైన విషయం తెలిసిందే. అలాగే, గతేడాది మార్చిలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన గిల్.. ఆ తర్వాత ఫామ్ కోల్పోయాడు. ఆ తర్వాత 12 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు.

మరోవైపు, ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో టీమ్ ఇండియా తొలి రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(171 బ్యాటింగ్) అజేయ భారీ సెంచరీతో కదం తొక్కడంతో మొదటి రోజు భారత్ పైచేయి సాధించింది. ఆట ముగిసే సమయానికి 6 వికెట్లను కోల్పోయి 336 పరుగులు చేసింది.

Advertisement

Next Story