IPL 2023: అది ధోనీకే సాధ్యం.. జార్ఖండ్ డైనమేట్ తాకిందంతా బంగారమే..

by Vinod kumar |
IPL 2023: అది ధోనీకే సాధ్యం.. జార్ఖండ్ డైనమేట్ తాకిందంతా బంగారమే..
X

చెన్నై: గతేడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈసారి ఏకంగా ఫైనల్లోకి దూసుకెళ్లింది. పదోసారి ఫైనల్లో అడుగు పెట్టిన చెన్నై జట్టు ఆదివారం విజయం సాధిస్తే ఆరోసారి టైటిల్ సాధించిన ఘనతను సొంతం చేసుకుంటుంది. ఇక పని అయిపోయిందనుకున్న జట్టును టైటిల్ రేసులో నిలబెట్టిన ఘనత ఆ జట్టు కెప్టెన్, 41 ఏళ్ల జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీదే. పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లను కూడా అత్యుత్తమ ఆటగాళ్ల సరసన చేర్చడం ధోనీకే సాధ్యం. ఎలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా మైదానంలో కూల్‌గా కనిపించే ధోనీ తన జట్టుకూ ఆ మంత్రమే నేర్పించాడు. ‘జట్టుపై నమ్మకం ఉంచాలి. జట్టుకు నమ్మక ఇవ్వాలి’ అనే సూత్రం ఆధారంగా ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తి నింపడం వల్లే చెన్నై జట్టు ఆరో టైటిల్ కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ జార్ఖండ్ డైనమేట్ తాకిందంతా బంగారమే అవుతుందని టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా అన్న మాటలు నిజమే అనిపిస్తున్నాయి.

కొత్త కుర్రాళ్లకు ప్రోత్సాహం..

డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ ల ఓపెనింగ్ జోడీ చెన్నై జట్టుకు పెట్టని కోటగా నిలిచింది. 625 పరుగులు చేసిన కాన్వే, 564 పరుగులు చేసిన గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ లీస్టులో టాప్ 10లో నిలిచారంటే ధోనీ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే.. వీళ్లిద్దరూ కలిసి 15 మ్యాచ్‌ల్లో 1189 పరుగులు చేయడం వల్లే చెన్నై జట్టుకు బలమైన పునాది పడి.. ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయి. యువ బౌలర్ తుషార్ దేశ్ పాండే (21) సైతం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడంటే కొత్త కుర్రళ్లను ధోనీ ఎంతగా ప్రోత్సహిస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ధోనీ సూచించినట్లు బంతులు విసిరితే చాలు.. వికెట్లు రావడం ఖాయమనే విషయాన్ని శ్రీలంకకు చెందిన మరో యువ పేస్ బౌలర్ మతీశా పతిరనను చూస్తే తెలుస్తుంది. ఐపీఎల్‌లో ధోనీకి ఇది చివరి సీజన్ అనుకుంటున్న సమయంలో ‘కూల్ కెప్టెన్’ను ట్రోఫీతో సాగనంపాలనే పట్టుదలతో చెన్నై జట్టు ఉంది. అందుకే.. ఫైనల్ చేరిన ఈ జట్టు టైటిల్ సాధించే వరకూ అదే పట్టుదలను కనబరుస్తుందని మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story