చెన్నయ్‌కు షాక్.. ఈ సీజన్ నుంచి కాన్వే ఔట్

by Swamyn |
చెన్నయ్‌కు షాక్.. ఈ సీజన్ నుంచి కాన్వే ఔట్
X

దిశ, స్పోర్ట్స్: వరుస విజయాలతో జోరుమీదున్న ‘చెన్నయ్ సూపర్ కింగ్స్‌’(సీఎస్కే)కు షాక్ తగిలింది. జట్టు కీలక బ్యాటర్ డెవన్ కాన్వే ఈ సీజన్ మొత్తానికీ దూరం కానున్నాడు. ఐపీఎల్ ప్రారంభం కాకముందు నుంచే ఎడమ చేతి బొటనవేలి గాయంతో బాధపడుతున్న ఈ న్యూజిలాండ్ ఆటగాడు.. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకుంటాడని భావించినా అది జరగలేదు. కోలుకునేందుకు మరింత సమయం పట్టనుండటంతో ఈ సీజన్‌కు కాన్వే దూరం కానున్నాడు. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది. అతని స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ రిచర్డ్ గ్లీసన్‌ను తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే.. రెండింట్లో మాత్రమే ఓడిపోయి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. కాన్వే లేనిలోటు ఇప్పుడే తెలియకపోయినా దీర్ఘకాలిక సమయంలో మాత్రం తప్పక కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎస్కే ఓపెనర్‌గా గత సీజన్‌లో అద్భుతంగా రాణించిన కాన్వే.. 16 మ్యాచ్‌ల్లో 672 పరుగులు చేసి జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫైనల్‌ మ్యాచ్‌లోనూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. గత సీజన్‌లో చెన్నై జట్టు టైటిల్ నెగ్గడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు.



Advertisement

Next Story