దంచికొట్టిన షెఫాలి.. ఫైనల్‌కు ఢిల్లీ

by Swamyn |
దంచికొట్టిన షెఫాలి.. ఫైనల్‌కు ఢిల్లీ
X

దిశ, స్పోర్ట్స్: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ) జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఢిల్లీ వేదికగా బుధవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లు మరిజన్నె, శిఖా పాండే, మున్ను మణి రెండేసి వికెట్లు పడగొట్టారు. వీళ్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లలో భారతి ఫుల్మాలీ(42) మినహా మిగతావారంతా చేతులెత్తేశారు. 127 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న ఢిల్లీ.. నేరుగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రెండో స్థానంలో ఉన్న ముంబై జట్టు.. మూడో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు ఢిల్లీతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం(ఈ నెల 17న) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

అర్ధసెంచరీతో చెలరేగిన షెఫాలీ

గుజరాత్ జట్టు నిర్దేశించిన 127 స్వల్ప విజయ లక్ష్యాన్ని ఢిల్లీ.. మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 13.1ఓవర్లలోనే ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షెఫాలీ వర్మ దంచికొట్టడంతో సునాయస విజయం దక్కింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మెగ్ లానింగ్(18), వన్‌డౌన్‌లో వచ్చిన అలీస్ క్యాప్సీ(0) ఓకే ఓవర్(3)లో వెంటవెంటనే అవుటయ్యారు. దీంతో 31 పరుగుల వద్ద ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, అప్పటికే క్రీజులో కుదురుకున్న మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(71; 37బంతుల్లో 7ఫోర్లు, 5 సిక్సులు) దూకుడైన ఆటతీరుతో బౌలర్లకు చుక్కలు చూపించింది. 28 బంతుల్లోనే(5 ఫోర్లు, 4సిక్సులు) అర్ధసెంచరీ సాధించింది. మరోవైపు, జెమీమా రోడ్రిగ్స్(38) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. ఇద్దరూ కలిసి 90 పరుగులకు పైగా భాగస్వామ్యం నిర్మించారు. విజయానికి మరో రెండు పరుగులు అవసరమనగా, షెఫాలీ క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగింది. మిగతా పనిని రోడ్రిగ్స్ పూర్తిచేసింది. ఢిల్లీ బౌలర్లలో తనుజా కన్వార్ మాత్రమే రెండు వికెట్లు తీసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ.. ఆరింట్లో విజయం సాధించింది.

సంక్షిప్త స్కోరు బోర్డు

గుజరాత్ జెయింట్స్: 126/9 (20ఓవర్లు)

ఢిల్లీ క్యాపిటల్స్: 129/3 (13.1ఓవర్లు)


Advertisement

Next Story