ముంబైపై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ.. వరుసగా నాలుగో విజయం

by Harish |
ముంబైపై ప్రతీకారం తీర్చుకున్న ఢిల్లీ.. వరుసగా నాలుగో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) సీజన్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురులేకుండా పోయింది. ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేస్తూ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా, ఓపెనింగ్ మ్యాచ్‌లో ఓటమికి ముంబైపై ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 29 పరుగుల తేడాతో ఢిల్లీ గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో 192/4 స్కోరు చేసింది. రోడ్రిగ్స్(69 నాటౌట్), లానింగ్(53) మెరుపు హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంతరం లక్ష్య ఛేదనలో తడబడిన ముంబై జట్టు నిర్ణీత ఓవర్లలో 163/8 స్కోరుకే పరిమితమైంది. అమన్‌జోత్ కౌర్(42) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్(3/21), మారిజన్నె కాప్(2/37) రాణించారు. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ముంబై మూడో స్థానంలో ఉన్నది.

తడబడిన ముంబై

193 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబై జట్టు మొదటి నుంచి తడబడింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. తొలి ఓవర్‌లోనే యాస్తికా భాటియా(6) వెనుదిరగగా.. నాట్ స్కివర్ బ్రంట్(5), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(6) దారుణంగా తేలిపోయారు. కాసేపు దూకుడుగా ఆడిన ఓపెనర్ హేలీ మాథ్యూస్(29), అమేలియ కెర్(17) కూడా అవుటవడంతో ముంబై 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో పూజ వస్త్రాకర్(17)తో కలిసి అమన్‌జోత్ కౌర్(42) ధాటిగా ఆడి ఆశలు రేపినా అవి ఎంతో సేపు నిలువలేదు. జోనాస్సెన్ ఆమె దూకుడుకు బ్రేక్ వేసింది. ఆ తర్వాత సజన(24 నాటౌట్) పోరాటం చేసినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైంది. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ 3 వికెట్లు, మారిజన్నె కాప్ 2 వికెట్లు తీశారు. శిఖా పాండే, టిటాస్ సాధు, రాధా యాదవ్‌లకు చెరో వికెట్ దక్కింది.

రోడ్రిగ్స్, లానింగ్ మెరుపులు

అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ ధాటిగా ప్రారంభించారు. అయితే, దూకుడుగా ఆడే క్రమంలో షెఫాలీ వర్మ(28) వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన అలీస్ క్యాప్సే(19) నిరాశపర్చగా.. లానింగ్‌కు జెమీమా రోడ్రిగ్స్ తోడైంది. వీరిద్దరూ వరుస బౌండరీలతో చెలరేగారు. ఈ క్రమంలో 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన మెగ్ లానింగ్(53) అదే ఓవర్‌లో పెవిలియన్ చేరింది. లానింగ్ అవుటైనా రోడ్రిగ్స్ మాత్రం అదే దూకుడును కొనసాగించింది. చివరి ఐదు ఓవర్లలో ఆమె బౌలర్లను ఊతికారేసింది. 19వ ఓవర్‌లో వరుసగా ఓ ఫోరు, రెండు సిక్స్‌లు కొట్టి 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. రోడ్రిగ్స్(69 నాటౌట్) ఆఖర్లో మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ 190కిపైగా స్కోరు సాధించింది.

సంక్షిప్త స్కోరుబోర్డు

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : 192/4(20 ఓవర్లు)

(రోడ్రిగ్స్ 69 నాటౌట్, లానింగ్ 53, షెఫాలీ వర్మ 28, పూజా వస్త్రాకర్ 1/20)

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 163/8(20 ఓవర్లు)

(అమన్‌జోత్ కౌర్ 42, హేలీ మాథ్యూస్ 29, జొనాస్సెన్ 3/21, మారిజన్నె కాప్ 2/37)

Advertisement

Next Story