యువ షట్లర్ మాళవిక సంచలన ప్రదర్శన.. చైనా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు అర్హత

by Harish |
యువ షట్లర్ మాళవిక సంచలన ప్రదర్శన.. చైనా ఓపెన్‌లో క్వార్టర్స్‌కు అర్హత
X

దిశ, స్పోర్ట్స్ : చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ సంచలన ప్రదర్శన చేస్తున్నది. తన కంటే మెరుగైన ర్యాంకింగ్స్ కలిగిన ప్రత్యర్థులను చిత్తు చేస్తున్నది. టోర్నీలో రెండో విజయాన్ని అందుకున్న ఆమె ఉమెన్స్ సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తొలి రౌండ్‌లో వరల్డ్ నం.7 తుంజంగ్‌కు షాకిచ్చిన విషయం తెలిసిందే. గురువారం జరిగిన రెండో రౌండ్‌లోనూ ఆమె అదే జోరు ప్రదర్శించింది. వరల్డ్ నం. 25, స్కాట్లాండ్‌కు చెందిన కిర్స్టీ గిల్మర్‌ను 21-17, 19-21, 21-16 తేడాతో ఓడించింది.

గంటా 5 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మాళవిక పోరాడి మరి విజయాన్ని అందుకుంది. దీంతో సూపర్-1000 టోర్నీలో తొలిసారిగా క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. దీంతో సైనా నెహ్వాల్, పీవీ సింధు తర్వాత ఓ సూపర్-1000 టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకున్న మూడో భారత క్రీడాకారిణిగా మాళవిక నిలిచింది. ‘కల నిజమైంది. ఇప్పటివరకు నేను సాధించిన విజయాల్లో ఇది చాలా పెద్దది. క్వార్టర్స్‌కు చేరుకుంటే ఎలా ఉంటుందని టోర్నీకి ముందు కలలు కన్నాను. నేను ఇప్పుడు టాప్-8లో ఉన్నాను. చాలా ఆనందంగా ఉంది.’ అని మాళవిక తెలిపింది. కాగా, క్వార్టర్స్‌లో మాళవిక కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోనుంది. రెండు సార్లు వరల్డ్ చాంపియన్ అయిన అకానె యమగూచి(జపాన్)తో తలపడనుంది.

Advertisement

Next Story

Most Viewed