Canada Open 2023: కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్

by Vinod kumar |   ( Updated:2023-07-10 13:44:59.0  )
Canada Open 2023: కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్
X

కాల్గరీ : భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అదరగొట్టాడు. కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ మెన్స్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-18, 22-20 తేడాతో తన కంటే మెరుగైన ర్యాంక్ కలిగిన చైనా ఆటగాడు, ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ చాంపియన్ లి షి ఫెంగ్‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు.

తొలి రౌండ్‌లో‌నే 2వ సీడ్‌కు షాకిచ్చి టోర్నీని ఘనంగా ప్రారంభించిన లక్ష్యసేన్.. సెమీస్‌లో 4వ సీడ్ కెంటో నిషిమోటోను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాడు. టైటిల్ పోరులోనూ అతను అదే జోరు ప్రదర్శించాడు. ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడి గెలిచాడు. తొలి గేమ్‌ ప్రారంభంలోనే 6-2తో ఆధిక్యంలోకి వెళ్లిన లక్ష్యసేన్ చైనా ఆటగాడి నుంచి ప్రతిఘటనను ఎదుర్కొని ఆధిక్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడు.

అయితే, ఒక దశలో ఫెంగ్ స్కోరును 15-15తో సమం చేసినప్పటికీ ఆ వెంటనే వరుసగా మూడు పాయింట్స్ గెలుచుకుని అదే జోరుతో తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, రెండో గేమ్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్టు పోటీపడ్డారు. 6-6తో స్కోర్లు సమమైన వేళ బలంగా పుంజుకున్న ఫెంగ్ వరుసగా నాలుగు పాయింట్స్ గెలుచుకుని 10-6తో లక్ష్యసేన్‌ను వెనక్కినెట్టాడు. అయితే, ఏ మాత్రం పట్టుదల వదలని భారత ఆటగాడు ఒక్కొక్క పాయింట్ సాధిస్తూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని తగ్గించాడు.

ఈ క్రమంలో 20-20తో స్కోరును సమం చేశాడు. అదే జోరులో వరుసగా రెండు పాయింట్స్‌తో లక్ష్యసేన్ రెండో గేమ్‌ను కూడా దక్కించుకుని టైటిల్ ఎగరేసుకపోయాడు. దాంతో ఈ సీజన్‌లో తొలి వరల్డ్ టూర్ టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, అతని కెరీర్‌లో ఇది రెండో వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ టైటిల్. గతేడాది ఇండియా ఓపెన్ నెగ్గడం ద్వారా తొలి టైటిల్ గెలిచాడు.

Advertisement

Next Story

Most Viewed