ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఆరు నెలలపాటు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

by Harish |
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఆరు నెలలపాటు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
X

దిశ, స్పోర్ట్స్ : అనుకున్నదే జరిగింది. ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం స్పష్టం చేసింది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెలలో కంగారుల గడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. వెన్నెముకకు సర్జరీ కారణంగా గ్రీన్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అందుబాటులో ఉండటం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.

‘వెన్నెముకలో పగుళ్లు గ్రీన్ విషయంలో మరింత గాయం కావడానికి అవకాశం ఉంది. వైద్యులు సర్జరీ అవసరమని చెప్పారు. శస్త్రచికిత్స ద్వారానే ప్రయోజనం ఉంటుందని, భవిష్యత్తులో గాయం పునరావృతం కాకుండా అడ్డుకుంటుందని వైద్యులు సూచించారు.’ అని తెలిపింది. గత నెలలో ఇంగ్లాండ్‌ పర్యటనలో గ్రీన్ వెన్నుముక గాయంతో సతమతమయ్యాడు. టూరు మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. స్కానింగ్‌లో వెన్నెముకలో పగులు వచ్చినట్టు వైద్యలు గుర్తించారు.

సర్జరీ తర్వాత గ్రీన్ కోలుకోవడానికి దాదాపు ఆరు నెలలు పట్టొచ్చు. ఈ క్రమంలో అతను భారత్‌తో పోరుతోపాటు శ్రీలంక పర్యటనకు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి దూరం కానున్నాడు. ఆసిస్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రీన్ అందుబాటులో ఉండకపోవడం ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. మరోవైపు, వార్నర్ రిటైర్మెంట్ తర్వాత సీనియర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఓపెనర్‌గా వస్తు్న్నాడు. దీంతో 4వ స్థానంలో గ్రీన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. భారత్‌తో సిరీస్‌కు గ్రీన్ అందుబాటులో లేకపోవడంతో స్మిత్ తిరిగి 4వ స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నట్టు చీఫ్‌ సెలక్టర్ జార్జ్‌ బెయిలీ తెలిపాడు.

Advertisement

Next Story