నా రికార్డును ఆ ఇద్దరు భారత కుర్రాళ్లు బద్దలుకొట్టగలరు : బ్రియాన్ లారా

by Harish |
నా రికార్డును ఆ ఇద్దరు భారత కుర్రాళ్లు బద్దలుకొట్టగలరు : బ్రియాన్ లారా
X

దిశ, స్పోర్ట్స్ : టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉంది. 2004లో ఇంగ్లాండ్‌పై అతను 400 పరుగులతో అజేయంగా నిలిచాడు. 20 ఏళ్లలో ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బ్రియాన్ లారాను ‘మీ రికార్డును ఎవరైనా అధిగమించగలరా?’ అని అడిగారు. దానికి సమాధానమిస్తూ లారా.. భారత యువ క్రికెటర్లు యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకున్నాడు. తన రికార్డును బద్దలుకొట్టే సత్తా వారికి ఉందని అభిప్రాయపడ్డాడు.

‘నేను ఆడే సమయంలో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వాళ్లు దూకుడుగా ఆడేవాళ్లు. వాళ్లు కనీసం 300 పరుగుల మార్క్‌ను దాటారు. ప్రస్తుతం ఎంత మంది దూకుడుగా ఆడే ప్లేయర్లు ఉన్నారు. భారత జట్టులో యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ ఆ రికార్డును అధిగమించొచ్చు. ఇంగ్లాండ్‌లో జాక్ క్రాలీ, హ్యారీ బ్రూక్ ఉన్నారు. సరైన సందర్భంలో రికార్డులు బ్రేక్ చేయబడతాయి.’ అని చెప్పుకొచ్చాడు.

కాగా, సుదీర్ఘ ఫార్మాట్‌లో జైశ్వాల్ రెండు డబుల్ సెంచరీలు బాదిన విషయం తెలిసిందే. వాటిని ఇంగ్లాండ్‌పై బాదడం గమనార్హం. 9 మ్యాచ్‌ల్లో అతను రెండు డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1,028 రన్స్ చేశాడు. మరోవైపు, గిల్ 25 టెస్టుల్లో 1, 492 పరుగులు చేశాడు. అందులో 4 సెంచరీలు, 6 అర్ధ శతకాలు ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed