అల్కరాజ్‌కు బిగ్ షాక్.. సెమీస్‌లోకి మెద్వెదేవ్, జెంగ్, యస్త్రెంకా

by Swamyn |
అల్కరాజ్‌కు బిగ్ షాక్.. సెమీస్‌లోకి మెద్వెదేవ్, జెంగ్, యస్త్రెంకా
X

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్‌కు బిగ్ షాక్ తగిలింది. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో వరల్డ్ నం.2 అల్కరాజ్.. ఆరో సీడ్, అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ (జర్మనీ) చేతిలో 1-6, 3-6, 7-6 (7-2), 4-6 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో క్వార్టర్ ఫైనల్స్‌ దశలోనే అల్కరాజ్ ఇంటిబాట పట్టాడు. 3గంటలకు పైగా సాగిన వీరి పోరులో తొలి రెండు సెట్లలో జ్వెరేవ్‌ చెలరేగి ఆడాడు. అల్కరాజ్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా రెండు గేమ్‌లను దక్కించుకున్నాడు. అయితే, మూడో సెట్‌లో అల్కరాస్‌ పుంజుకుని టై బ్రేక్‌లో పైచేయి సాధించాడు. నాలుగో సెట్‌లో జ్వెరేవ్ మళ్లీ జోరు చూపించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ విజయంతో జ్వెరేవ్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరగనున్న సెమీ ఫైనల్‌లో రష్యా ఆటగాడు మెద్వెదేవ్‌తో తలపడనున్నాడు. ఇక, హోరాహోరీగా సాగిన మరో క్వార్టర్ ఫైనల్‌లో 9వ సీడ్, హుబర్ట్ హర్కాజ్‌(పోలాండ్)‌పై డానియల్ మెద్వెదేవ్ 7-6(4), 2-6, 6-3, 5-7, 6-4 తేడాతో విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌లో మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌ సెమీస్‌కు అర్హత సాధించాడు.

అదరగొట్టిన జెంగ్.. నం.1లోకి బోపన్న

ఇక, మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనా ప్లేయర్ కిన్వెన్ జెంగ్, ఉక్రెయిన్ క్రీడాకారిణి డయానా ఎస్త్రెంకా అదరగొట్టారు. రష్యన్ ప్లేయర్ అన్నా కలిన్స్‌కాయాపై జెంగ్ 6-7(4-7) 6-3 6-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో లిండా నొస్కోవా(చెక్ రిపబ్లిక్)పై డయానా 6-3, 6-4 తేడాతో విజయం గెలుపొందింది. గురువారం జరగనున్న సెమీస్‌లో జెంగ్, డయానా పోటీ పడనున్నారు. వీరితోపాటు భారత టెన్నిస్ ప్లేయర్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా)ల జోడీ సైతం సెమీస్‌లోకి చేరుకుంది. మెన్స్ డబుల్స్ క్వార్టర్‌ఫైనల్‌లో అర్జెంటీనా జోడీ మొల్టేనీ-గోంజైజ్‌పై 6-4, 7-6(7-5) తేడాతో బోపన్న జోడీ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో గెలవడంతో మెన్స్ డబుల్స్‌లో బోపన్న అగ్రస్థానానికి చేరుకున్నాడు. అంతేకాకుండా, 43ఏళ్ల బోపన్న డబుల్స్‌లో తొలి ర్యాంకు సాధించిన ఎక్కువ వయసున్న ఆటగాడిగానూ ఘనత సాధించాడు.


Advertisement

Next Story

Most Viewed