వన్డే రిటైర్మెంట్‌పై బెన్‌ స్టోక్స్ యూటర్న్..?

by Vinod kumar |
వన్డే రిటైర్మెంట్‌పై బెన్‌ స్టోక్స్ యూటర్న్..?
X

న్యూఢిల్లీ : ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గతేడాది జూలైలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని చెబుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, వన్డే రిటైర్మెంట్‌పై స్టోక్స్ యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరిగి వన్డేల్లోకి రావాలని, భారత గడ్డపై జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) స్టోక్స్‌ను అడిగినట్టు తెలిసింది. అలాగే, ఇంగ్లాండ్ కోచ్ మాథ్యూ మోట్ సైతం స్టోక్స్ వన్డే రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరాడు.

‘అతను ఆసక్తిగా ఉన్నాడో లేదో చూద్దాం. అతను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, అతను తిరిగి వస్తాడని మేము ఆశిస్తున్నాం.’ తెలిపాడు. కాగా, ఇటీవల యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ టెస్టు రిటైర్మెంట్‌పై తాత్కాలికంగా యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. మెయిన్ అలీ దారిలోనే బెన్ స్టోక్స్ సైతం ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు వన్డే రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటాడో లేదో చూడాలి. ఇంగ్లాండ్ జట్టు 2019 వరల్డ్ కప్‌ గెలవడలంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సత్తాచాటిన స్టోక్స్(84 నాటౌట్).. మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు మళ్లించాడు. అక్కడ కూడా స్కోర్లు సమమవ్వగా.. అత్యధిక బౌండరీలతో ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది.

Advertisement

Next Story

Most Viewed