తొలి టీ20లో విండీస్ షాక్.. కరేబియన్ గడ్డపై బంగ్లాదేశ్ సంచలనం

by Harish |
తొలి టీ20లో విండీస్ షాక్.. కరేబియన్ గడ్డపై బంగ్లాదేశ్ సంచలనం
X

దిశ, స్పోర్ట్స్ : కరేబియన్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు సంచలనం సృష్టించింది. తొలి టీ20లో వెస్టిండీస్‌ను ఓడించి విండీస్‌ గడ్డపై తొలి టీ20 విజయాన్ని అందుకుంది. టీ20 సిరీస్‌లో భాగంగా సెయింట్ విన్సెంట్ వేదికగా సోమవారం జరిగిన మొదటి మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 2007 నుంచి కరేబియన్ గడ్డపై బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. తాజాగా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు ఆ జట్టు తెరదించింది.

మ్యాచ్ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 147 రన్స్ చేసింది. సౌమ్య సర్కార్(43), షామిమ్ హుస్సేన్(27), జాకర్ అలీ(27), మెహది హసన్(26) రాణించడంతో పోరాడే స్కోరు దక్కింది. అనంతరం బంగ్లా బౌలర్లు అద్భుత ప్రదర్శనతో లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ముఖ్యంగా బ్యాటుతో విలువైన పరుగులు జోడించిన స్పిన్నర్ మెహది హసన్(4/13) బంతితోనూ సత్తాచాటాడు.

దీంతో ఛేదనలో తడబడిన విండీస్ 19.5 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ పొవెల్(60) చేసిన ఒంటరి పోరాటం వృథా అయ్యింది. ఆఖరి ఓవర్‌లో విండీస్ విజయానికి 10 రన్స్ అవసరమవ్వగా.. హసన్ మహమూద్(2/18) అద్భుతం చేశాడు. చివరి ఓవర్‌లో పొవెల్‌, అల్జారీ జోసెఫ్(9)లను అవుట్ చేసి బంగ్లా విజయాన్ని లాంఛనం చేశాడు. తాజా విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.


Advertisement

Next Story