Bashar al-Assad : డ్రోన్ దాడుల నేపథ్యంలోనే రష్యాకు.. సిరియాను వీడటంపై తొలిసారి అసద్ ప్రకటన

by Sathputhe Rajesh |
Bashar al-Assad : డ్రోన్ దాడుల నేపథ్యంలోనే రష్యాకు.. సిరియాను వీడటంపై తొలిసారి అసద్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : డమాస్కస్‌‌లో డ్రోన్ దాడుల నేపథ్యంలోనే సిరియాను వీడినట్లు అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ప్రకటించారు. దేశాన్ని వీడటంపై తొలిసారి ఆయన రష్యా నుంచి సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘ఆశ్రయం పొందడం ఎప్పటికి ఆప్షన్ కాదు. కానీ డమాస్కస్‌లో డ్రోన్ దాడుల నేపథ్యంలోనే రష్యాకు వెళ్లాను. ప్రణాళిక వేసుకుని సిరియాను వీడలేదు. ఉగ్రవాదులు దేశ రాజధానిలోకి చొరబడిన డిసెంబర్ 8న తెల్లవారు జాము వరకు నా విధులను నిర్వర్తించాను. ఉగ్రవాదులు డమాస్కస్‌కు చేరుకున్న తర్వాత రష్యా మిత్రదేశాల సమన్వయంతో లటాకియాకు చేరుకున్నాను. హిమిమ్ ఎయిర్ బేస్‌కు ఉదయం చేరుకున్న తర్వాత దేశ భద్రతా బలగాలు అన్ని సరిహద్దుల నుంచి ఉపసంహరించుకున్నట్లు నిర్ధారించుకున్నాను.’ అని అసద్ అన్నారు. తన నిష్క్రమణకు వ్యక్తిగత ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయిందన్న ఆయన జాతీయ దృక్పథానికి తాను అంకితమైనట్లు తెలిపారు. వ్యక్తిగత లాభాల కోసం తానేప్పుడు పదవులు పొందలేన్నారు. సిరియా ప్రజల విశ్వాసంతో దేశ అభివృద్ధికి కస్టోడియన్‌లా మాత్రమే తాను ఉన్నట్లు స్పష్టం చేశాడు.

రష్యాకు 250 మిలియన్ డాలర్లు తరలింపు..

అంతర్యుద్ధంతో తీవ్ర సంక్షోభం వేళ సిరియా అధ్యక్షుడు అసద్ భారీగా నగదును రష్యాకు తరలించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. 2018-19లో 500 యూరో నోట్లు, రెండు టన్నులు 100 డాలర్ల నోట్లను విమానాల్లో మాస్కోకు తరలించినట్లు తెలిసింది. సిరియాపై పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో వాటిని తప్పించుకునేందుకు ఇలా చేసినట్లు సమాచారం. మొత్తం 250 మిలియన్ డాలర్ల(రూ.2వేల కోట్ల)ను మాస్కోకు తరలించినట్లు తాజా కథనంలో ఫైనాన్షియల్ టైమ్స్ స్పష్టం చేసింది. సిరియా సెంట్రల్ బ్యాంకు నుంచి విమానాలు మాస్కోలోని వ్యూంకోవ్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకునేవని తెలుస్తోంది. ఆర్థిక, సైనికపరమైన సాయాలను క్రెమ్లిన్ చక్కదిద్దేది. వాగ్నర్ కిరాయి సైన్యం అసద్ పక్షాన ఉండటంతో సిరియాపై ఆయన పట్టు కొనసాగించారు.

Advertisement

Next Story