Twelve Indians die in Georgia : జార్జియాలో 12 మంది భారతీయులు దుర్మరణం

by Sathputhe Rajesh |
Twelve Indians die in Georgia : జార్జియాలో 12 మంది భారతీయులు దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో : జార్జియాలో 12 మంది భారతీయులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి భారతీయ రెస్టారెంట్‌ గుడౌరి మౌంటెయిన్ రిసార్ట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హోటల్‌ రెండో అంతస్తులోని బెడ్ రూమ్‌లో వీరంతా విగత జీవులుగా పడి ఉన్నట్లు సమాచారం. కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్ పీల్చడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు తిబ్లిసిలోని భారతీయ రాయభార కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ప్రకటన విడుదుల చేసింది. ‘ జార్జియాలోని గుడౌరిలో12 మంది భారతీయులు చనిపోయినట్లు సమాచారం అందింది. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులతో మాట్లాడి చనిపోయిన వారి వివరాలను సేకరిస్తున్నాం.’ అని పేర్కొంది. ప్రాథమిక విచారణలో వారి బెడ్ రూమ్ సమీపంలో ఉన్న పవర్ జనరేటర్ నుంచి విడుదలైన వాయువు మూసి ఉన్న గదిలో కార్బన్ మోనాక్సైడ్‌గా మారినట్లు గుర్తించారు. అయితే ఖచ్చితమైన సమాచారం కోసం ఫోరెన్సిక్ విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే జార్జియా మాత్రం చనిపోయిన వారిలో 11 మంది భారతీయులు, తమ దేశ పౌరుడు ఒకరు ఉన్నట్లు వెల్లడించింది. దర్యాప్తులో మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొంది.

Advertisement

Next Story