Jupally Krishna Rao: అప్పుల కుప్ప.. చేతికి చిప్ప

by Gantepaka Srikanth |
Jupally Krishna Rao: అప్పుల కుప్ప.. చేతికి చిప్ప
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చి.. బంగారు పళ్లెంలో పెట్టి అధికారాన్ని అప్పగించామని హరీష్ రావు మాట్లాడారని, బంగారు పళ్లెంలో ఏముందని చూస్తే.. అప్పుల కుప్ప, చిప్ప చేతికిచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అసెంబ్లీలో సోమవారం తెలంగాణ పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను ప్రారంభించి మాట్లాడారు. పర్యాటక పాలసీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచాలనే ఆలోచనతో షార్ట్ డిస్కషన్ పెడితే అడ్డగించడం సరికాదన్నారు. గడిచిన పదేండ్లలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే కనీస అవగాహన లేకుండా వ్యవహరించారన్నారు. గత పదేండ్లుగా వారు చేయని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక పాలసీని తీసుకువచ్చి, తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని చూస్తుంటే.. వీళ్ళేదో గొప్పగా చేసినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

వాళ్లకు ఏ అంశంపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. తెలంగాణ కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. తెలంగాణ కోసం మీరేమీ చేశారు?. దయచేసి మీ కోసం కాదు మా కోసం కాదు. యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం మీరందరూ సహకరించాలని కోరారు. మీరు చేయలేని పని మేము చేస్తుంటే మీకు కోపం ఎందుకు?. మమ్మల్ని తిట్టండి కానీ అనుభవం ఉన్న వాళ్లు సభను ఆడుకోవడం దుర్మార్గం అన్నారు. పర్యాటకం అంటే సృష్టిలోని అందాలను తిలకించడమన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరస్ ఇస్తున్నప్పటికీ తమప్రసంగాన్ని మంత్రి కొనసాగించి ముగించారు.

Advertisement

Next Story