Breaking News : అమ్మాయి వలలో పాక్ కు భారత రహస్యాలు.. ఉద్యోగి అరెస్ట్

by M.Rajitha |
Breaking News : అమ్మాయి వలలో పాక్ కు భారత రహస్యాలు.. ఉద్యోగి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత రక్షణ రంగానికి(Indian Army) సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్థాన్(Pakistan)​కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ అమ్మాయి వలలో చిక్కిన అతను, భారత సైన్యం ఆయుధాలకు సంబంధించిన సున్నితమైన సమాచారంతో పాటు, గగన్‌యాన్‌ ప్రాజెక్టు(Gaganyan Project) వివరాలను కూడా అందించినట్లు తెలుస్తోంది. యూపీ(UP)కి చెందిన రవీంద్ర కుమార్‌ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పుర్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ(Ordinance Foctory)లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గతేడాది అతనికి ఫేస్​బుక్​లో నేహా శర్మ అనే మహిళ పరిచయమైంది. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ కోసం పనిచేస్తున్న ఆమె, ఆ విషయాన్ని దాచిపెట్టి రవీంద్ర కుమార్​తో మెల్లగా స్నేహం చేసింది. వలపు వల విసిరి, డబ్బు ఆశ జూపి అతనిని తన గుప్పింట్లోకి తెచ్చుకుంది. ఆ తరువాత క్రమంగా అతని నుంచి మిలిటరీ రహస్యాలను సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

నేహా శర్మ నంబరును చంద్రన్‌ స్టోర్‌కీపర్‌ పేరుతో సేవ్‌ చేసుకున్న రవీంద్ర, వాట్సప్‌లో ఆమెకు అనేక కీలక పత్రాలు పంపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ, 51 గోర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్‌ డ్రోన్‌ పరీక్షలు, రోజువారీ ఉత్పత్తి వివరాలు, స్క్రీనింగ్‌ కమిటీ పంపిన రహస్య లేఖలను సంపాదించి వాటిని పాక్‌ ఏజెంట్​కు పంపించినట్లు తెలిసింది. ఇందులో గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు, పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఐఎస్‌ఐ సభ్యులతోనూ రవీంద్ర కుమార్ నేరుగా టచ్‌లో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. భారత రక్షణ రంగ ప్రాజెక్టులకు సంబంధించిన సున్నితమైన నిఘా సమాచారాన్ని వారికి పంపించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడితో పాటు అతని స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed