ఆర్ఎస్ఎస్, బీజేపీకి క్షమాపణలు చెప్పను

by John Kora |
ఆర్ఎస్ఎస్, బీజేపీకి క్షమాపణలు చెప్పను
X

- ఇప్పటికీ ఆర్ఎస్ఎస్‌పై నా స్టాండ్ అదే

- ఇప్పుడు నా సంకల్పం మరింత దృఢమైంది

- మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్ఎస్ఎస్, బీజేపీపై తన అభిప్రాయం ఏ మాత్రం మారదని, గతంలో చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల తిరువునంతపురంలో దివంగత గాంధేయవాది పి.గోపీనాథన్ నాయర్ విగ్రహాన్ని తుషార్ గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కేరళలోకి ప్రవేశించిన ప్రమాదకరమైన, కృత్రిమ శత్రువులని అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ ఒక విషపూరిత సంస్థ అని కూడా చెప్పారు. కాగా, తుషార్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆయన వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ వారసుడిగా ఆయన అనుకోకుండా జన్మించారు. తన ముత్తాత పేరు ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని తుషార్ గాంధీపై బీజేపీ ఎదురు దాడి చేసింది.

మహాత్మా గాంధీ పేరు ఉపయోగించుకొని చాలా ఏళ్లుగా తుషార్ భారీగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నాయకుడు వి. మురళీధరన్ ఆరోపించారు. విగ్రహావిష్కరణకు తుషార్‌ను పిలిచిన వారికి బహుషా తన నేపథ్యం తెలియకపోవచ్చని అన్నారు. తుషార్‌కు చివరి గాంధీ అని పేరు ఉన్నందున.. జాతిపితకు ఇచ్చే గౌరవాన్ని పొందే అర్హత రాదని మురళీధరన్ మండిపడ్డారు. తుషార్ గాంధీ చేసిన ప్రకటనకు ఆయన్ను అరెస్టు చేయాలని మురళీధరన్ డిమాండ్ చేశారు.

అయితే శుక్రవారం కొచ్చీకి సమీపంలోని అలువాలో జరిగిన కార్యక్రమంలో తుషార్ గాంధీ మాట్లాడుతూ తాను గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ జరగదని అన్నారు. ఈ సంఘటన ద్వారా దేశ ద్రోహులను మరింతగా బయటపెట్టాలనే నా సంకల్పం మరింత దృఢంగా తయారయ్యిందని అన్నారు. ఇప్పుడు జరిగేది స్వాతంత్ర పోరాటం కంటే చాలా ముఖ్యమైన పోరాటం. మనకు ఇప్పుడు ఉన్న ఉమ్మడి శత్రులు సంఘ్ పరివార్. వారి ద్రోహాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందని తుషార్ గాంధీ స్పష్టం చేశారు. నా ముత్తాత హంతకుల వారసులు మహాత్మా గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి వారి అలవాటు ప్రకారం పేల్చేస్తారేమో అని తుషార్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story