- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rakesh Tikait: 'ఏకమవ్వకపోతే ఓటమి ఖాయం'.. రైతులకు రాకేశ్ టికాయత్ పిలుపు

దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్ రైతు నేత జగ్జిత్ సింగ్ డల్లేవాల్ ఆమరణ నిరాహార దీక్ష 21వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేష్ టికాయత్ రైతు సంఘాల మధ్య ఐక్య పోరాటానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 'బాటోగే తో లుటోగే' (మీరు ఏకం కాకపోతే ఓడిపోతారు) అంటూ నినాదం వినిపించారు. రైతుల ఐక్యత కోసం పిలుపుపునిస్తూనే టికాయత్ డల్లేవాల్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. గత వారం ఖనౌరీలో డల్లేవాల్‌ను కలిసిన టికాయత్, తమ డిమాండ్‌లకు మద్దతుగా అందరూ కలిసి పోరాడటానికి రైతుల సంఘాలు కలిసి ఉండడంలోని ప్రాముఖ్యతను పునరుద్ఘాటించారు. 70 ఏళ్ల డల్లేవాల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నారు. నవంబర్ 26 నుంచి పంజాబ్, హర్యానా మధ్య ఖనౌరీ సరిహద్దు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి చట్టబద్ధమైన హామీతోపాటు ఆందోళన చేస్తున్న రైతుల అభ్యర్థనలను కేంద్రం ఆమోదించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాగా, రైతులు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా బ్యానర్లతో 'ఢిల్లీ చలో' మార్చ్ నిర్వహిస్తున్నారు. రాజధానికి వెళ్లే వారి పాదయాత్రను పోలీసులు అడ్డుకున్న తర్వాత ఫిబ్రవరి 13 నుంచి శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అన్ని రైతు సంఘాలు ఢిల్లీ చలో మార్చ్‌కు పిలుపునిచ్చినప్పటికీ, అన్ని రైతు సంఘాలు కలిసి వ్యూహాన్ని రూపొందించకపోతే ఆశించిన ఫలితాలు సాధించలేవని టికాయత్ పేర్కొన్నారు.