థాయిలాండ్ ఓపెన్‌లో అదరగొడుతున్న సాత్విక్ జోడీ.. సెమీస్‌కు క్వాలిఫై

by Harish |
థాయిలాండ్ ఓపెన్‌లో అదరగొడుతున్న సాత్విక్ జోడీ.. సెమీస్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : థాయిలాండ్‌లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్ క్రీడాకారులు సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి అదరగొడుతున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో వీరు సెమీస్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-7, 21-14 తేడాతో మలేషియాకు చెందిన జనైద్ ఆరిఫ్-రాయ్ కింగ్ యాప్ జంటను చిత్తుగా ఓడించింది. సాత్విక్, చిరాగ్ దూకుడు ముందు ప్రత్యర్థి షట్లర్లు నిలువలేకపోయారు. భారత జంట పూర్తి ఆధిపత్యంతో 38 నిమిషాల్లోనే రెండు గేమ్‌లను గెలుచుకుంది. ఈ సీజన్‌లో సాత్విక్ జోడీ సెమీస్‌కు చేరుకున్న 4వ టోర్నీ ఇది. సెమీస్‌లో మింగ్ చె లు-టాంగ్ కై వీ(చైనీస్ తైపీ) జోడీతో తలపడనుంది.

మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప జంట కూడా సెమీస్‌కు చేరుకుంది. క్వార్టర్స్‌లో తనీషా, అశ్విని జంట 21-15, 21-23, 21-19 తేడాతో సౌత్ కొరియాకు చెందిన లీ యు లిమ్-షిన్ సెయుంగ్ చాన్‌‌పై పోరాడి గెలిచింది. గంటా 16 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరికి భారత అమ్మాయిలే పైచేయి సాధించారు. అయితే, సెమీస్‌లో ఈ జంటకు కఠిన సవాల్ ఎదురైంది. టాప్ సీడ్ కిటితారాకుల్-రవింద ప్రజోంగ్‌జాయ్(థాయిలాండ్)ను ఎదుర్కోనుంది. మరోవైపు, పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ మీరబా లువాంగ్ మైస్నం సంచలన ప్రదర్శనకు తెరపడింది. క్వార్టర్స్‌లో వరల్డ్ చాంపియన్ కున్లావుట్ విటిద్సర్న్(థాయిలాండ్) చేతిలో 21-12, 21-5 తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించాడు.

Advertisement

Next Story