డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడే జట్టును ప్రకటించిన ఆసీస్..

by Vinod kumar |
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడే జట్టును ప్రకటించిన ఆసీస్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమ్ ఇండియాతో తలపడే టీమ్‌ను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా. ఈ ఏడాది జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత జట్టును ఎదుర్కొనబోతోంది. ఈ రెండింట్లో ఏది గెలిచినా- డబ్ల్యూటీసీ టైటిల్‌ను సాధించిన మొదటి జట్టవుతుంది. వచ్చే జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. లండన్‌లోని ఓవల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇందులో భారత జట్టును ఎదుర్కొనబోయే జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. టెస్ట్ ఫార్మట్ రెగ్యులర్ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ జట్టుకు నాయకత్వాన్ని వహించనున్నాడు. స్టీవెన్ స్మిత్‌కు వైస్ కెప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. వన్డే, టీ20 స్పెషలిస్టులతో టెస్ట్ టీమ్‌ను రెడీ చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్.

ఆల్‌ రౌండర్ మిఛెల్ మార్ష్‌ను మళ్లీ టెస్ట్ ఫార్మట్ క్రికెట్‌లో చోటు కల్పించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ప్రకటించిన జట్టులో అతన్ని తీసుకుంది. 4 సంవత్సరాల తరువాత మొదటిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడబోతోన్నాడు మిఛెల్ మార్ష్. పాట్ కమ్మిన్స్ సారథ్యంలోని ఈ జట్టులో- స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హ్యారీస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లీస్, ఉస్మాన్ ఖవాజా, మార్నుస్ లాంబుషెన్, నాథన్ లియాన్, మిఛెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవెన్ స్మిత్ (వైస్ కేప్టెన్), మిఛెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్‌కు చోటు కల్పించింది.

Advertisement

Next Story