ఆసిస్‌ బౌలర్లను ఊచకోతకోసిన రస్సెల్, రూథర్‌ఫోర్డ్

by Harish |
ఆసిస్‌ బౌలర్లను ఊచకోతకోసిన రస్సెల్, రూథర్‌ఫోర్డ్
X

దిశ, స్పోర్ట్స్ : మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భావించిన ఆతిథ్య ఆస్ట్రేలియాకు ఆఖరి టీ20లో వెస్టిండీస్ షాకిచ్చింది. రస్సెల్, రూథర్‌ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌‌తో చివరి మ్యాచ్‌‌లో కరేబియన్ జట్టు విజయం సాధించింది. మంగళవారం పెర్త్ వేదికగా జరిగిన మూడో టీ20లో 37 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 220 పరుగులు చేసింది. టాప్ -3 బ్యాటర్లు జాన్సన్ చార్లెస్(4), కైల్ మేయర్స్(11), పూరన్(1) విఫలమవడంతో విండీస్‌ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. రోస్టన్ చేజ్(37), కెప్టెన్ రోవ్‌మెన్ పొవెల్(21) దూకుడుగా ఆడే క్రమంలో వికెట్ పారేసుకోవడంతో 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కోలుకునేలా కనిపించలేదు. ఈ పరిస్థితుల్లో రస్సెల్(71), రూథర్‌ఫోర్డ్(67 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చివరి ఐదు ఓవర్లలోనే 84 పిండుకున్నారంటే వీరిద్దరు ఏ విధంగా రెచ్చిపోయారో అర్థం చేసుకోవచ్చు. ముందుగా రూథర్‌ఫోర్డ్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయగా.. రస్సెల్ 25 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 19వ ఓవర్‌లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదిన అతను ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. చివరి ఓవర్‌లో మూడో బంతికి రస్సెల్ క్యాచ్ అవుటవ్వగా.. రూథర్‌ఫోర్డ్ అజేయంగా నిలిచాడు.

అనంతరం 221 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేసింది. డేవిడ్ వార్నర్(81) మరోసారి చెలరేగాడు. అతను క్రీజులో ఉన్నంత సేపు పరుగుల వరద పారింది. అయితే, 10 ఓవర్ల తర్వాత విండీస్ బౌలర్లు వరుస వికెట్లతో ఆసిస్‌ను కష్టాల్లోకి నెట్టారు. మిచెల్ మార్ష్(17), ఆరోన్ హార్డి(16), జోష్ ఇంగ్లిష్(1), గ్లెన్ మ్యాక్స్‌వెల్(12) దారుణంగా నిరాశపరిచారు. ఆఖర్లో టిమ్ డేవిడ్(41 నాటౌట్) మెరిసినా జట్టును గెలిపించలేకపోయాడు. దీంతో ఆస్ట్రేలియా 2-1తో టీ20 సిరీస్‌ను దక్కించుకుంది. మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లో అంతకుముందు వన్డే సిరీస్‌ను 3-0తో కంగారుల జట్టు క్లీన్‌స్వీప్ చేయగా.. రెండు టెస్టుల సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed