యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం.. సిన్నర్‌దే వరల్డ్ నం.1 ర్యాంక్

by Harish |
యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం.. సిన్నర్‌దే వరల్డ్ నం.1 ర్యాంక్
X

దిశ, స్పోర్ట్స్ : యూఎస్ ఓపెన్‌కు కొత్త చాంపియన్‌ వచ్చాడు. ఇటలీ స్టార్ టెన్నిస్ ప్లేయర్ జెన్నిక్ సిన్నర్ తొలిసారిగా మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్‌లో సిన్నర్ 6-3, 6-4, 7-5 తేడాతో అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. సిన్నర్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గాడు.

యూఎస్ ఓపెన్ విజయంతో సిన్నర్ మెన్స్ సింగిల్స్ వరల్డ్ నం.1 స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. సోమవారం విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో 1,820 పాయింట్స్‌ను మెరుగుపర్చుకున్న సిన్నర్ 11,180 పాయింట్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తిరిగి టాప్-10లోకి అడుగుపెట్టిన ఫ్రిట్జ్ ఐదు ర్యాంక్‌లు ఎగబాకి 7వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. జ్వెరెవ్(జర్మనీ) 2వ ర్యాంక్‌కు దూసుకెళ్లగా.. ఆ స్థానంలో ఉన్న దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్(సెర్బియా) 4వ ర్యాంక్‌కు పడిపోయాడు. స్పెయిన్ స్టార్ అల్కరాజ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు, డబ్ల్యూటీఏ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఇగా స్వైటెక్(పొలాండ్) టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. యూఎస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సబలెంక(బెలారస్) రెండో స్థానాన్ని కాపాడుకోగా.. రన్నరప్ పెగులా(అమెరికా) కెరీర్ బెస్ట్ వరల్డ్ నం.3 ర్యాంక్‌ను చేరుకుంది.

Advertisement

Next Story

Most Viewed