మన చరిత్రను కుట్ర పూర్వకంగా తొక్కేశారు..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |
మన చరిత్రను కుట్ర పూర్వకంగా తొక్కేశారు..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అశువుల బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణకు ఆగస్టు 15, 1947లో స్వాతంత్య్రం రాలేదని, ఈతరం యువతకు తెలియదన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17, 1948న హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. అప్పుడు మూడు రంగుల జెండా ఎగిరిందని తెలిపారు. అప్పుడే ఈ ప్రాంత ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారన్న విషయం చాలా మందికి తెలియదన్నారు. అది వారి తప్పుకాదని, ఉద్దేశ పూర్వకంగా, కుట్ర పూర్వకంగా ఇక్కడి చరిత్రను అప్పటి పాలకులు తొక్కి పెట్టేశారని తెలిపారు. ఇంతటి మహత్తరమైన పోరాటం, వాస్తవం,చరిత్ర, త్యాగాలు, బలిదానాలు, సాధించిన స్వాతంత్య్రాన్ని దాచిపెట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సైతం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్రప్రభుత్వం చొరవతో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక నుంచి తెలంగాణ విమోచన దినోత్సావాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తామన్నారు. నిజాంకు వ్యతిరేకంగా చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే అపూర్వమైన ఘట్టమని తెలిపారు. కత్తులు, రోకళ్లు, గొడ్డలతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి రజాకార్లపై పోరాటం కొనసాగించారన్నారు. స్వాతంత్ర్యానికి ముందు భారత దేశం బ్రిటీష్ పాలనలో అణిగిపోయిందని చెప్పారు. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణ.. నిజాం నియంతృత్వం, రజాకార్ల ఆకృత్యాల మధ్య నలిగిపోయిందన్నారు. నిజాం ప్రభుత్వం, రజాకార్ల దౌర్జన్యాల కారణంగా తెలంగాణ ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారని గుర్తు చేశారు. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు రజాకార్ల దురాఘాతాలు సాగాయన్నారు. కరుడుకట్టిన మతోన్మాది ఖాసీం రజ్వీ.. రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపై హత్యాకాండ కొనసాగించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed