ఆసియా కప్‌ వేదికపై వీడిన సస్పెన్స్..! టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే..?

by Vinod kumar |   ( Updated:2023-06-11 12:26:27.0  )
ఆసియా కప్‌ వేదికపై వీడిన సస్పెన్స్..! టీమిండియా మ్యాచ్‌లు ఎక్కడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్‌ 2023 విషయంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పంతం నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ నిర్వహించేందుకు పాకిస్తాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌కు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) పచ్చజెండా ఊపడం దాదాపుగా ఖాయమైందని సమాచారం. భారత్‌ ఆడే మ్యాచ్‌లు మినహా మిగతా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో.. భారత్‌ ఆడే మ్యాచ్‌లు శ్రీలంకలో నిర్వహించేందుకు ఏసీసీ ఒప్పుకుందని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో వన్డే వరల్డ్ కప్ ముందు ఆసియా కప్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించే అవకాశం ఈసారి పాకిస్తాన్‌కు దక్కింది. అయితే తమ జట్టును అక్కడకు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేనందున తమ ప్లేయర్లను పాక్‌కు పంపడం కుదరదని తేల్చేసింది. ఆ దేశంలో తమ జట్టుకు భద్రతా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే పాక్ కోరినట్లు భారత్ ఆడే మ్యాచులను యూఏఈలో నిర్వహించడానికి ఏసీసీ ఒప్పుకోలేదని సమాచారం. ఈ మ్యాచులను శ్రీలంకలో ఏర్పాటు చేయాలని సూచించిందట. అంటే భారత్, పాకిస్తాన్ మ్యాచులు కూడా లంకలోనే జరగనుంది. దీనికి పీసీబీ కూడా ఒప్పుకుంది. దీనిపై మరికొన్ని రోజుల్లో ఏసీసీ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి.

పాక్‌ ప్రతిపాదించిన హైబ్రిడ్‌ మోడల్‌ ప్రకారం.. ఆసియా కప్‌లో భాగంగా జరిగే 13 మ్యాచ్‌ల్లో 4 లేదా 5 మ్యాచ్‌లు మాత్రమే వారి స్వదేశంలో జరిగే అవకాశం ఉంది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌లు సహా భారత్‌ ఆడే మిగతా మ్యచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరుగుతాయి. టీమిండియా ఫైనల్‌కు చేరితే, ఆ మ్యాచ్‌ కూడా శ్రీలంకలోనే నిర్వహిస్తారు. ఆసియా కప్‌-2023లో భారత్‌, పాక్‌లతో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌ జట్లు పాల్గొంటాయి. భారత్‌, పాక్‌, నేపాల్‌లు గ్రూప్‌-ఏలో.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు గ్రూప్‌-బిలో తలపడతాయి. ఆ తర్వాత సూపర్‌-4, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి.

Advertisement

Next Story

Most Viewed