ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన భారత యువ రెజ్లర్

by Vinod kumar |
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన భారత యువ రెజ్లర్
X

అస్తానా: ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. ఫ్రీస్టైల్ 57 కేజీల కేటగిరీలో అమన్ స్వర్ణ పతకం కొల్లగొట్టాడు. కజఖస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ పతకాల పంట పండిస్తుండగా.. సెహ్రావత్ భారత్ ఖాతాలో తొలి స్వర్ణం చేర్చాడు. గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమన్ 9-4 తేడాతో కిర్గిస్థాన్‌కు చెందిన అల్మాజ్ స్మాన్‌బెకోవ్‌‌ను చిత్తు చేసి విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత రెజ్లర్ ప్రత్యర్థికి ఏ అవకాశం ఇవ్వలేదు.

అంతకుముందు క్వార్టర్స్, సెమీస్‌లోనూ అమన్ ఏకపక్ష విజయాలు అందుకున్నాడు. క్వార్టర్ ఫైనల్‌లో 7-1 తేడాతో జపాన్ రెజ్లర్ రికుటోను మట్టికరిపించగా..సెమీస్‌లో 7-4 తేడాతో చైనా రెజ్లర్ వాన్హావో జూపై గెలుపొందాడు. ఈ ఏడాది అమన్‌కు ఇది రెండో పతకం. ఫిబ్రవరిలో జాగ్రెబ్ ఓపెన్‌లో కాంస్యంతో ఈ ఏడాదిని ఆరంభించాడు. గతేడాది అండర్-23 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అమన్ స్వర్ణం గెలుచుకున్నాడు. మరో భారత రెజ్లర్ దీపక్ 79 కేజీల కేటగిరీలో కాంస్యం సాధించాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో దీపక్ 12-1 తేడాతో తజికిస్తాన్ రెజ్లర్ షుహ్రత్ బోజోరోవ్‌పై విజయం సాధించాడు.

అంతకుముందు సెమీస్‌లో దీపక్ 0-10 తేడాతో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బెక్జోడ్ అబ్దురఖ్మోనోవ్ చేతిలో పరాజయం పాలై స్వర్ణ పోరుకు దూరమైన.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో సత్తాచాటాడు. మరో భారత రెజ్లర్ దీపక్ నెహ్రా 97 కేజీల కేటగిరీలో తృటిలో పతాకాన్ని కోల్పోయాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్ రెజ్లర్ మఖ్సూద్ వెయ్సలోవ్ 12-9 తేడాతో ఓడిపోయాడు. ఈ టోర్నీలో భారత్ 13 పతకాలను సాధించింది. గ్రీకో రోమన్ కేటగిరీలో 4 పతకాలు గెలుచుకోగా.. మహిళా రెజ్లర్లు 7 పతకాలతో మెరిశారు.

Advertisement

Next Story

Most Viewed