భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అజయ్ కుమార్..

by Vinod kumar |
భారత అంధుల క్రికెట్ టీమ్ కెప్టెన్‌గా అజయ్ కుమార్..
X

న్యూఢిల్లీ: బర్మింగ్‌హామ్‌ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్(ఐబీఎస్ఏ) వరల్డ్ గేమ్స్‌లో బరిలోకి దిగే భారత పురుషుల, మహిళల అంధుల క్రికెట్ జట్ల కెప్టెన్లను క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా(సీఏబీఐ) గురువారం ప్రకటించింది. పురుషుల జట్టుకు అజయ్ కుమార్ ఇల్లూరి(బీ2 కేటగిరీ) కెప్టెన్‌గా నియామకమయ్యాడు. అతనికి వెంకటేశ్వర రావు దున్నె(బీ2 కేటగిరీ) డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే కావడం విశేషం. అజయ్ కుమార్ సారథ్యంలో భారత జట్టు 2016‌లో ఆసియా కప్, 2017లో టీ20 వరల్డ్ కప్, 2018లో వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.

అలాగే, మహిళల క్రికెట్ జట్టుకు కర్ణాటకకు చెందిన వర్ష ఉమాపతి(బీ1 కేటగిరీ) సారథ్యం వహించనుంది. ఒడిశాకు చెందిన ఫూలా సరెన్(బీ3 కేటగిరీ) వైస్ కెప్టెన్‌గా నియామకమైంది. అలాగే, ఇదే కార్యక్రమంలో భారత పురుషుల, మహిళల జట్ల జెర్సీలను ఆవిష్కరించారు. బర్మింగ్‌హామ్ వేదికగా ఆగస్టు 18 నుంచి 27 వరకు ఐబీఎస్ఏ వరల్డ్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇదే తొలిసారి. ఆగస్టు 20న పురుషుల, మహిళల జట్లు ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడనున్నాయి. పురుషుల జట్టు పాకిస్తాన్‌తో తలపడనుండగా.. మహిళల జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడనుంది.

Advertisement

Next Story