Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి జేఎంఎం పోటీ

by Shamantha N |   ( Updated:2024-10-19 12:08:02.0  )
Jharkhand: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి జేఎంఎం పోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలిసి పోటీ చేస్తామని సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. కాంగ్రెస్, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా 81 అసెంబ్లీ సెగ్మెంట్లలో 70 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతాయని చెప్పారు. "మేము ప్రస్తుతం సీట్ల పంపకానికి సంబంధించిన వివరాలు చెప్పలేం. మా కూటమి బాగస్వామి ప్రస్తుతం ఇక్కడ లేరు. అందరూ ఉన్నప్పుడు సీట్ల సంఖ్య, ఇతర వివరాలు త్వరగా వెల్లడిస్తాం " అని సోరెన్ అన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం ఇతర కూటమి భాగస్వాములు, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో భాగస్వామ్య చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా లేదా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేయగా, కాంగ్రెస్ 31 స్థానాల్లో బరిలో నిలిచింది. అయితే, ఈసారి కాంగ్రెస్‌కు 27 నుంచి 28 సీట్లు వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆర్జేడీ అసహనం

ఇకపోతే, కాంగ్రెస్, జేఎంఎం సీట్ల సర్దుబాటుపై ఆర్జేడీ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీట్ల పంపకాలను తప్పు బట్టింది. సీఎం సోరెన్ నిర్ణయం ఏకపక్షంగాఉందని తాము నిరాశచెందామని వెల్లడించింది. ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో తమ ముందు అన్ని అవకాశాలు ఉన్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ ఝా అన్నారు. 15- 18 స్థానాల్లో ఒంటరిగానే బీజేపీని ఓడించే సత్తా ఆర్జేడీకి ఉందని అన్నారు. ఇకపోతే, ఇప్పటికే సీట్ల షేరింగ్ గురించి ఎన్డీఏ కూటమి ప్రకటన వెలువరించింది. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, దాని మిత్రపక్షాలు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10 స్థానాల్లో, జనతాదళ్ (యునైటెడ్) రెండు స్థానాల్లో, లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) ఛత్రా ఒక్క స్థానంలో పోటీ చేయనున్నాయి. వచ్చే నెల 13,20 వ తేదీల్లో జార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Advertisement

Next Story