ఐసీసీ నుంచి బీసీసీఐకి 38.5% ఆదాయం : Jay Shah

by Vinod kumar |
ఐసీసీ నుంచి బీసీసీఐకి 38.5% ఆదాయం : Jay Shah
X

ముంబై: ఐసీసీ నుంచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు లభించే ఆదాయం 22.4% నుంచి 38.5%కు పెరిగింది. ఈ నిర్ణయం దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో శుక్రవారం జరిగిన ఐసీసీ పాలకమండలి వార్షిక సమావేశంలో తీసుకున్నారని బీసీసీఐ కార్యదర్శి జయ్ షా తెలిపారు. 2024-27 సైకిల్‌లో ఐసీసీకి ఏడాదికి 600 మిలియన్ అమెరికన్ డాలర్లు (రూ.4,929 కోట్లు) లభిస్తాయి. అందులో బీసీసీఐ 38.5% వాటా పొందేట్లు ఐసీసీ కొత్త ఫైనాన్స్ మోడల్‌‌ను ఆమోదించారు. ఈ మోడల్ ప్రకారం రానున్న నాలుగేళ్ల పాటు బీసీసీఐ ఏడాదికి 230 మిలియన్ డాలర్లను (రూ.1,890 కోట్లు) ఆర్జిస్తుంది. ఇప్పటి వరకు ఐసీసీ ఆదాయంలో భారత్ వాటా 22.4% మాత్రమే. అంటే.. బీసీసీఐ ఆదాయం ఇప్పుడు దాదాపు 72% పెరిగింది.

ఈ విషయాన్ని జయ్ షా శుక్రవారం వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు పంపించిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర సంఘాలు, బీసీసీఐ సహచర సభ్యుల సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఐసీసీ సభ్యులతో తమ బలమైన దౌత్య, వ్యూహాత్మక సంబంధాలు కూడా వాటాను పెంచుకోవడంలో కీలకపాత్ర పోషించాయని తెలిపారు. క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ ‘వ్యూహాత్మక నిధి’ని ఏర్పాటు చేయడంలో బీసీసీఐ కృషి కూడా ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed