నేడు జింబాబ్వేతో నాలుగో టీ20.. గెలిస్తే సిరీస్ భారత్ సొంతం

by Harish |
నేడు జింబాబ్వేతో నాలుగో టీ20.. గెలిస్తే సిరీస్ భారత్ సొంతం
X

దిశ, స్పోర్ట్స్ : యువ భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న గిల్ సేన టీ20 సిరీస్‌పై కన్నేసింది. నేడు నాలుగో టీ20లో జింబాబ్వేను ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ భారత్ సొంతమవుతుంది. మరి, భారత్ నాలుగో టీ20లోనే సిరీస్‌ను పట్టేస్తుందా?లేదా? చూడాలి.

జోరు కొనసాగించాలని..

ఈ సిరీస్‌ను ఘోర పరాజయంతో మొదలుపెట్టిన భారత్ ఆ తర్వాత లోపాలను అధిగమించింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. నాలుగో టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తున్నది. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో గిల్ టచ్‌లోకి వచ్చాడు. రుతురాజ్ గైక్వాడ్ నిలకడగా రాణిస్తుండటం ప్రధాన బలం. మూడో టీ20కి జైశ్వాల్, శాంసన్, దూబె రాకతో జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్‌గా వచ్చిన జైశ్వాల్(36) పర్వాలేదనిపించాడు. రెండో టీ20లో ఓపెనర్‌గా సెంచరీ చేసిన అభిషేక్(10) మూడో టీ20లో మూడో స్థానంలో పంపించడంతో అతను నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో అతన్ని తిరిగి ఓపెనర్‌గా పంపించి.. జైశ్వాల్‌ను ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దింపుతారో చూడాలి. శాంసన్, రింకు సింగ్‌, దూబె‌, సుందర్ వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉండటం భారత్‌కు బలంగా చెప్పుకోవచ్చు. మరోవైపు, బౌలర్లలో అవేశ్ ఖాన్ ఫామ్‌లో ఉన్నాడు. రవి బిష్ణోయ్, సుందర్ రాణిస్తున్నారు. నాలుగో టీ20లోనూ వీరు ప్రత్యర్థిని కట్టడి చేస్తే సిరీస్ దక్కినట్టే.

సిరీస్ సమం చేయాలని..

వరుసగా రెండు పరాజయాలతో వెనుకబడిన జింబాబ్వే సిరీస్‌ను సమం చేయడంపై దృష్టి పెట్టింది. బ్యాటర్ల నిలకడలేమి ఆ జట్టుకు సమస్యగా మారింది. జింబాబ్వే బ్యాటర్లు ఒక్క మ్యాచ్‌లో రాణిస్తే మరో మ్యాచ్‌లో విఫలమవుతున్నారు. వికెట్ కీపర్ మాండడే మాత్రమే నిలకడగా రాణిస్తున్నాడు. మాధెరే, బెన్నెట్, డియోన్ మైయర్స్ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. కెప్టెన్ రజా బ్యాటు ఝుళిపించకపోవడం ఆ జట్టుకు నష్టాన్ని కలిగిస్తుంది. కీలకమైన నాలుగో టీ20లో సమిష్టిగా రాణించి భారత్‌ను అడ్డుకోవాలని జింబాబ్వే భావిస్తున్నది. బౌలింగ్ పరంగా రజా, ముజారబానీ నిలకడగా రాణిస్తుండటం సానుకూలంశం.

తుది జట్లు(అంచనా)

భారత్ : కెప్టెన్(గిల్), యశస్వి జైశ్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, శాంసన్, శివమ్ దూబె, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే : మారుమని, మాధవెరే, బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), కాంప్‌బెల్, క్లైవ్ మడాండే, మసకద్జ, ఎంగర్వ, ముజారబానీ, చటార.

Advertisement

Next Story

Most Viewed