కోట్లు కుమ్మరిస్తున్నారు.. ఆ ఉపఎన్నిక అంత విలువైందా..!

by Anukaran |   ( Updated:2021-03-06 09:09:02.0  )
కోట్లు కుమ్మరిస్తున్నారు.. ఆ ఉపఎన్నిక అంత విలువైందా..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక చాలా ఖరీదుగా మారనుంది. ఇప్పటికే మండలి పోరు సాగుతుండగా… త్వరలోనే సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్​ వస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు చాలా ప్రతిష్టాత్మకమైనవి. ఇక్కడ గెలుపు కోసం ఇప్పటినుంచే వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలతో పాటు కాంగ్రెస్​ కూడా ఈ స్థానం లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. దీంతో పార్టీలు ప్రచారంతో పాటు కోట్లు కుమ్మరించనున్నాయి. ఇక్కడ మరో విచిత్రమేమిటంటే… తమ అభ్యర్థి గెలుపు కంటే ప్రధానంగా ప్రత్యర్థి పార్టీ ఓటమికే ఎక్కువ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

గెలిచి తీరాల్సిందే..

సాగర్​ ఉప ఎన్నిక అన్ని పార్టీలపై ప్రభావం చూపించనుంది. ఇక్కడ గెలిస్తే తమ పట్టు అలాగే ఉందనే సంకేతాలు టీఆర్​ఎస్​ ఇవ్వనుంది. ఇటీవల కాలంలో గులాబీ పార్టీ వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. సాగర్​ ఉప ఎన్నికలో గెలిచి మళ్లీ తమ హవా నిరూపించుకునేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు బీజేపీ ఈ ఎన్నికను 2023 ఎన్నికలకు ప్రీఫైనల్​గా తీసుకుంటోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్​ఎంసీలో విజయం సాధించి ప్రత్యామ్నాయం మేమే అన్నట్లు దూసుకుపోతోంది. ఇక్కడ గెలిచి ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్​ పార్టీ పరిస్థితి తెలిసిందే. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి. టీపీసీసీ చీఫ్​ ఎంపిక వాయిదా పడుతుండటం కూడా పార్టీ శ్రేణులను నిరుత్సాహంలో పడేస్తోంది. ఉప ఎన్నికలో పార్టీ సీనియర్​ నేత జానారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ నుంచి ఆయన 2009, 2014 ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో మళ్లీ గెలిచి కాంగ్రెస్​కు రాష్ట్రంలో జీవం పోయాలని భావిస్తున్నారు.

బీజేపీ ఆశావహులపై టీఆర్ఎస్ గురి

ఈ ఉప ఎన్నికపై అధికార పార్టీ ప్రయోగాలు సిద్ధమైంది. ఎందుకంటే గెలుపు కష్టమని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రధాన ప్రత్యర్ధిగా బీజేపీని టార్గెట్​ చేస్తోంది. ఆ పార్టీ గెలువకుండా చేయాలనేదే టీఆర్​ఎస్​ ప్లాన్​. బీజేపీ గెలిస్తే రాష్ట్రంలో రాజకీయ పరిణమాలు మారుతాయని గులాబీ అధిష్టానం భావిస్తోంది. టీఆర్​ఎస్​ అభ్యర్థిని పెట్టినా… అవసరమైన పక్షంలో కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డికి వెనకుండి మద్దతు ఇవ్వాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీని దెబ్బ కొట్టాలనే లక్ష్యంతోనే కాషాయం పార్టీ నుంచి టికెట్​ ఆశిస్తున్న అభ్యర్థులపై గురి పెట్టింది. టికెట్​ రాని నేతలను స్వతంత్రులుగా బరిలో ఉండేలా టీఆర్​ఎస్​ ప్లాన్​ వేస్తోంది. ఈ వ్యూహంతో బీజేపీ ఓట్లను చీల్చాలనేదే టార్గెట్​. దీనికోసం స్వతంత్రులను రంగంలో ఉంచేందుకు కోట్లు ఖర్చు చేసేందుకు టీఆర్​ఎస్​ సిద్ధమవుతోంది. ముందుగా బీజేపీ టికెట్​ ఖరారు చేసిన తర్వాత ఆశావహులతో చర్చలు జరిపేందుకు ప్రత్యేకంగా నేతలను కూడా రంగంలోకి దింపింది.

బీజేపీలో టికెట్​ లొల్లి

వరుస విజయాలతో దూకుడు మీదున్న బీజేపీకి సాగర్​ పోరులో టికెట్​ లొల్లి మొదలైంది. రాష్ట్ర నేతలు ఒక్కొక్కరికి మద్దతుగా ఉంటున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ఒక వర్గాన్ని సపోర్టు చేస్తుంటే… ఎమ్మెల్యే రఘునందన్​రావు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ వంటి నేతలు మరొకరిని ఎంకరేజ్​ చేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన జానారెడ్డి అనుంగ అనుచరుడు ఇంద్రసేనారెడ్డి, అంజయ్య యాదవ్​ను సంజయ్​ వెనకేసుకు వస్తున్నారని, రఘునందన్​రావు మాత్రం గతంలో పోటీ చేసిన ఓడిన నివేదితారెడ్డికి అండగా ఉంటున్నట్లు పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ కేంద్ర నాయకత్వం సాగర్​పై సర్వేలు పూర్తి చేసింది. ఈ సర్వేల్లో సాగర్​లో విజయావకాశాలు ఉన్నట్లుగా తేలింది. నివేదితా రెడ్డికి 28 శాతం ఓట్లు వస్తాయనే అంచనా కూడా సర్వేలో తేలినట్లు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ తరుణ్​ చుగ్​ కూడా ఎటూ తేల్చక సర్వేలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో టికెట్​ కేటాయింపు కాషాయ దళానికి సమస్యగా మారుతోంది. వీరిలో ఎవరికి టికెట్​ ఇచ్చినా… వ్యతిరేకవర్గం తయారు కానున్నట్లు అనుమానిస్తున్నారు.

వివాదాలపైనే జానా ఆశలు

ఇక కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నా… పలు సర్వేల్లో మాత్రం కొంత వెనకబాటు కనిపిస్తున్నట్లు గుర్తించారు. కానీ బీజేపీని ఓడించే క్రమంలో టీఆర్‌ఎస్​తనకు వెనకుండి సపోర్టు చేస్తుందనే ఆశలో ఉన్నారు.

కోట్లు కుమ్మరించనున్న పార్టీలు

ఇప్పటి వరకు లేని విధంగా సాగర్​లో ఈసారి కాస్ట్​లీ ఎన్నిక కానుంది. గెలిచేందుకు పార్టీలన్నీ కోట్లు కుమ్మరించనున్నాయి. అధికార పార్టీ కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. తమ అభ్యర్థితో పాటు స్వతంత్రులను రంగంలోకి దింపే విధంగా ప్రోత్సహించి వారికి కోట్లు ఖర్చు చేయనున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. అటు బీజేపీ కూడా ప్రతిష్మాత్మకమైన ఈ ఎన్నికల కోసం భారీగానే ఖర్చు చేసేందుకు సిద్ధమవుతోంది. అటు కాంగ్రెస్​ కూడా ఉనికి కోసం కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలో సాగర్​ ఉప ఎన్నికకు కోట్లు ఖర్చు కానున్నాయి.

Advertisement

Next Story