కరోనా బాధితులకు ప్రత్యేక ఓటు..!

by Anukaran |   ( Updated:2020-09-23 01:33:26.0  )
కరోనా బాధితులకు ప్రత్యేక ఓటు..!
X

దిశ, వెబ్ డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై ఎన్నికల అథారిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డీఎస్.లోకేష్‌కుమార్‌ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కరోనా రోగులకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేకంగా తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పోలింగ్‌ శాతాన్ని పెంచడం, ఓటర్ల రక్షణ అంశాల్లో భాగంగా ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది. 55 ఏళ్లకు మించని ఆరోగ్యవంతులైన అధికారులనే ఎన్నికల విధులకు తీసుకోవాలని.. వేర్వేరు బాధ్యతలకు నోడల్ అధికారులను నియమిస్తూ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జార చేశారు.

ఇక పార్లమెంట్‌ ఎన్నికలకు గ్రేటర్‌ పరిధిలో 9వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. గ్రేటర్ ఎన్నికలకు 12వేల కేంద్రాలు అవసరమని అధికారులు నిర్ణయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌తో అయితే ప్రతి 800 మందికి ఓ పోలింగ్‌ కేంద్రం (పీఎస్‌), ఈవీఎంలు వినియోగిస్తే గరిష్ఠంగా 1,200 మందికి ఓ పీఎస్‌ అవసరమన్నారు. ఎన్నికలు 30 సర్కిళ్ల పరిధిలోని 150 డివిజన్లకు జరగనున్నాయి. పోలింగ్‌ కేంద్రాల సంఖ్య పెరిగినందున 20శాతం రిజర్వు స్టాఫ్‌తో కలిపి 60వేల మంది అవసరం అవుతారని అధికారులు అంచనా వేశారు.

Advertisement

Next Story